దేశంలోనే తొలిసారి వంట నూనెల వినియోగంపై సర్వే.. ఎందుకంటే?

by Yella Dhawani Reddy |

ప్రతి ఇంట్లో వంటిల్లు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే, ఏం వంటకం చేయాలన్నా నూనె తప్పక ఉండాల్సిందే.

దేశంలోనే తొలిసారి వంట నూనెల వినియోగంపై సర్వే.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఇంట్లో వంటిల్లు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే, ఏం వంటకం చేయాలన్నా నూనె తప్పక ఉండాల్సిందే. ఈక్రమంలో మనదేశంలో గత కొన్నాళ్లుగా వంట నూనె వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మరో వైపు భారత్‌లో ఆయిల్స్ సీడ్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోవటంతో.. వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ వినూత్న సర్వేకు శ్రీకారం చుట్టింది. దేశంలో వంట నూనెల వినియోగం ఎలా ఉందో తెలుసుకునేందుకు తొలిసారి ప్రజల నుంచి వీటిపై సమగ్ర సమాచార సేకరణకు ప్రత్యేకంగా సర్వే చేపట్టింది.

వాడిన వంటనూనె మళ్లీ వాడుతున్నారా?

మన దేశంలో వంటనూనె వినియోగం ఎలా ఉందనే విషయాన్ని అంచనా వేయడానికి కేంద్ర వ్యవసాయ ఈ సర్వే నిర్వహిస్తోంది. భారత అర్ధ, గణాంకశాఖ వెబ్‌సైట్‌లో ఈ సర్వేకు సంబంధించిన 24 ప్రశ్నలను ఉంచింది. ఆన్‌లైన్‌లో మీ అభిప్రాయాలు చెప్పడానికి ఈ నెల 23 వరకూ గడువు ఇచ్చింది. ఇందులో ఇంట్లో నిత్యం వేపుళ్లకు వాడిన వంటనూనె మళ్లీ వాడుతున్నారా?, వంటనూనెలు అధికంగా వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని మీకు తెలుసా? డీప్‌ ఫ్రై(బాగా వేయించిన) ఆహారాన్ని మీ ఇంట్లో తరచూ తింటారా? వంటి 24 ప్రశ్నలను ఉంచింది. వీటిలో కొన్ని ప్రశ్నలకు అవును, కాదు అని.. కొన్నింటికి నిర్దిష్ట సమాధానాలను ప్రశ్న కిందనే ఉంచింది. వాటిలో ఏదో ఒకటి ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే మీ నుంచి సమాచారం ప్రభుత్వానికి లభిస్తుంది.

ప్రజల అవగాహన

ముఖ్యంగా రోడ్లపై ఆహార పదార్థాలు తయారుచేసే వ్యాపారులు, కొన్ని చిన్న చిన్న హోటళ్లలో మళ్లీ మళ్లీ వంటనూనెలను మరగపెట్టి వినియోగిస్తున్నట్లు ఆహార నాణ్యత విభాగం అధికారులు గుర్తిస్తున్నారు. ఇలా గంటలకొద్ది మరగపెట్టి వినియోగించడం, ఒకసారి వాడిన దానిని మళ్లీ మళ్లీ వాడటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వాడకంపై ప్రజలకు ఎంతమేర అవగాహన ఉందనే సమాచారాన్ని నేరుగా తెలుసుకోవాలని ఈ సర్వేను చేపట్టినట్లు తెలుస్తోంది.

ఆయిల్‌సీడ్స్ ప్రోగ్రామ్‌ అమలు

ప్రపంచంలో అతిపెద్ద వంటనూనె వినియోగదారు, దిగుమతిదారైన మన దేశంలో ఏయే వినియోగదారులు ఎలాంటి వంటనూనెలను వాడుతున్నారన్న సమాచారం లేదు. ఈ నేపథ్యంలో నూనె గింజల సాగును పెంచడానికి ఉద్దేశించిన 'న్యూ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్‌సీడ్స్' (NEMO-Oilseeds) ఇనీషియేటివ్‌ను అమలు చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి NMEO ఆయిల్‌సీడ్స్ ప్రోగ్రామ్‌ని అమలు చేయనున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా వినియోగదారులు ఎక్కువగా వాడుతున్న, ఆరోగ్యకరమైన ఆయిల్ సీడ్స్‌ని ఎంపిక చేసి.. వాటి సాగును కేంద్రం ప్రోత్సహించనుంది. 2022-23లో 3.9 కోట్ల టన్నులుగా ఉన్న ఆయిల్ సీడ్ ప్రొడక్షన్‌ని.. 2030-31 నాటికి 6.97 కోట్ల టన్నులకు పెంచాలన్న లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది.

Next Story