ముంబై బీచ్‌లో వింత వ్యాపారం.. డబ్బులిచ్చి మీ బాధలు చెప్పుకోవచ్చు.. కలిసి ఏడవాలంటే రూ.1,000!

by Ramesh Naini |

ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి పెట్టిన వింత వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబై బీచ్‌లో వింత వ్యాపారం.. డబ్బులిచ్చి మీ బాధలు చెప్పుకోవచ్చు.. కలిసి ఏడవాలంటే రూ.1,000!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి పెట్టిన వింత వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మీ బాధలు వినే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు ముంబై వంటి మెట్రో నగరాల్లో మనిషికి మనిషి తోడు ఉండటం అరుదైపోయింది. సరిగ్గా ఇదే అంశాన్ని ఒక వ్యక్తి తన వ్యాపారంగా మలుచుకున్నాడు. ‘మీ బాధలు ఎవరికైనా చెప్పుకోవాలని ఉందా? అయితే నా దగ్గరకు రండి.. నేను వింటాను’ అంటూ ముంబై బీచ్‌లో ఒక వ్యక్తి పెట్టిన బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

ధరల పట్టిక ఇదే..

పృథ్వీరాజ్ బోహ్రా అనే వ్యక్తి ముంబై బీచ్‌లో ఒక చేతితో రాసిన బోర్డు పట్టుకుని కనిపిస్తున్నాడు. దానిపై హిందీలో ‘ఎవరికైనా తమ బాధలను పంచుకోవాలని ఉంటే, నేను వింటాను’ అని రాసి ఉంది. అయితే బాధలు ‘వినడానికి’ ఆయన ఉచితంగా ఏమీ సమయం కేటాయించడం లేదు. దానికంటూ ఒక ప్రత్యేక ధరల పట్టికను కూడా సిద్ధం చేశాడు. చిన్నపాటి సమస్యలు వినడానికి రూ. 250 , పెద్ద ఆందోళనలు, బాధలు వినడానికి రూ. 500 , కలిసి కూర్చుని ఏడవడానికి (Cry together) రూ.1,000 గా ధరలు నిర్ణయించాడు. ‘అసలు మీ దగ్గరకు ఎవరైనా వస్తున్నారా?’ అని అతని ఇంటర్వ్యూ చేసిన ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘కచ్చితంగా వస్తున్నారు, చాలా మంది తమ మనసులోని భారాన్ని దించుకోవడానికి నన్ను సంప్రదిస్తున్నారు’ అని పృథ్వీరాజ్ ధీమాగా సమాధానమిచ్చాడు.

నెట్టింట భిన్నాభిప్రాయాలు

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు దీనిని ‘అద్భుతమైన స్టార్టప్ ఐడియా’ అని కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం నగరాల్లో పెరిగిపోతున్న ఒంటరితనానికి ఇది పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రో నగరాల్లో మనుషులు ఎంత ఒంటరి వాళ్లయిపోయారో ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. చివరికి కన్నీళ్లు పంచుకోవడానికి కూడా డబ్బులు చెల్లించాల్సి రావడం బాధాకరం’ అని ఒక నెటిజన్ కామెంట్ హైలెట్‌గా మారింది. ఏది ఏమైనా, బాధలను కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ఈ ‘ముంబై బీచ్ మ్యాన్’ ఐడియా నెట్టింట చర్చనీయాంశమైంది.

Next Story