Vice President: నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా ఆయనే!.. విపక్షాలకు దెబ్బ కొట్టేలా బీజేపీ మాస్టర్ ప్లాన్?

by Prasad Jukanti |   (  Updated:2025-07-22 09:05:01  IST  )

ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ రాజీనామా అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Vice President: నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా  ఆయనే!..  విపక్షాలకు దెబ్బ కొట్టేలా బీజేపీ మాస్టర్ ప్లాన్?
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో తదుపరి ఈ పదవిని చేపట్టబోయేది ఎవరు అనే చర్చ మొదలైంది. నిన్న రాజ్యసభలో అంతా సాధారణంగా వ్యవహరించిన ధన్‌ఖడ్ సాయంత్రానికి అనూహ్య నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనారోగ్య కారణాలతోనే తప్పుకుంటున్నానని ప్రకటించినా.. ప్రతిపక్షాలు మాత్రం దీని వెనుక బీజేపీ వ్యూహం ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తోంది. తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కాబోయే ఉప రాష్ట్రపతి అనే టాక్ బలంగా వినిపిస్తోంది.

నితీశ్‌కు పెరుగుతున్న మద్దతు..

ధన్‌ఖడ్ అకస్మాత్తుగా వైదొలగడం వెనుక బీజేపీ మాస్టర్ స్కెచ్ ఉందనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రయోజనం ఆశించే ధన్ ఖడ్ చేత బలవంతంగా రాజీనామా చేయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ఉప రాష్ట్రపతిగా పంపడం ద్వారా త్వరలో బిహార్‌లో సొంత పార్టీకి చెందిన వ్యక్తిని సీఎం చేయాలనేది కమలం పార్టీ లక్ష్యమని తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చుతూ బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ మాట్లాడుతూ.. నితీశ్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా అందరూ చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ధన్‌ఖడ్ రాజీనామాతో నెక్స్ట్ ఉప రాష్ట్రపతి రేస్‌లో నితీశ్ కుమార్ పేరుతోపాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితర నేతల పేర్లు వినిపిస్తున్నాయి.

సౌత్ ఇండియాకు చాన్స్?..

వైస్ ప్రెసిడెంట్ విషయంలో నితీశ్ కుమార్ కాదనుకుంటే సౌత్ ఇండియా వ్యక్తిని బీజేపీ తెరపైకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేలా పార్టీ పావులు కదుపుతోంది. మిత్రపక్షాలను పోగేసుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఉప రాష్ట్రపతిగా పంపే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోదరుడు, ప్రముఖ తెలుగు యాక్టర్ చిరంజీవి పేరు సైతం ఈ రేస్‌లో వినిపిస్తోంది. మరోవైపు త్వరలో బీజేపీకి జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగాల్సి ఉండటంతో ఉప రాష్ట్రపతి పదవిని దక్షిణాదికి చెందిన వ్యక్తికి ఇచ్చి, పార్టీ అధ్యక్ష పదవిని నార్త్ ఇండియన్ నేతకు ఇవ్వాలని యోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Next Story