ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవంలో అరుదైన ఘట్టం: ఒకే వేదికపై పట్టా అందుకున్న తల్లీకుమారులు

by Ramesh Naini |

చదువుకు వయసుతో పనిలేదని నిరూపించిందో తల్లి. కుటుంబ బాధ్యతలతో వృత్తికి దూరమైన ఆమె, కుమారుడి ప్రోత్సాహంతో మళ్లీ పుస్తకం పట్టింది.

ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవంలో అరుదైన ఘట్టం: ఒకే వేదికపై పట్టా అందుకున్న తల్లీకుమారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చదువుకు వయసుతో పనిలేదని నిరూపించిందో తల్లి. కుటుంబ బాధ్యతలతో వృత్తికి దూరమైన ఆమె, కుమారుడి ప్రోత్సాహంతో మళ్లీ పుస్తకం పట్టింది. ఆ తల్లి పట్టుదల, కుమారుడి లక్ష్యం ఇద్దరినీ ఒకేసారి పట్టభద్రులను చేశాయి. ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవంలో తల్లీకుమారులు ఒకే వేదికపై పట్టా అందుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన జిగీశ టైలర్ (45) ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తూ.. 2019లో కుటుంబ బాధ్యతల వల్ల వృత్తికి విరామం ఇచ్చారు. ఆమె కుమారుడు ఆదిత్య కపాడియా (21) 2021 కోవిడ్ సమయంలో ఐఐటీ మద్రాస్ అందిస్తున్న ‘ఆన్‌లైన్ బీఎస్ (BS) - డేటా సైన్స్’ కోర్సులో చేరాడు. ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్న కుమారుడి ప్రోత్సాహంతో, కొత్త విషయం నేర్చుకోవాలన్న ఆసక్తితో 2022 చివర్లో జిగీశ కూడా అదే కోర్సులో చేరారు.

పోటీ పడి మరీ..

కుటుంబ బాధ్యతలు చక్కబెడుతూనే జిగీశ తన చదువును కొనసాగించారు. రోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి 7 గంటల వరకు చదువుకుని, ఆ తర్వాత ఇంటి పనులు చూసుకునేవారు. భర్త, అత్తామామల పూర్తి మద్దతుతో కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఒక దశలో తల్లి, కొడుకులు ఇద్దరూ క్లాస్‌మేట్స్‌లా మారి అత్యుత్తమ గ్రేడ్‌ల (A, S) కోసం పోటీ పడి మరీ చదువుకోవడం విశేషం.

ఒకేసారి వేదికపైకి..

ఇటీవల జరిగిన ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవంలో ఆదిత్య బీఎస్ (BS) డిగ్రీ అందుకోగా, జిగీశ డిప్లొమా పూర్తి చేసి పట్టా తీసుకున్నారు. తల్లీకుమారుల స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి తెలుసుకున్న నిర్వాహకులు.. ఇద్దరినీ ఒకేసారి వేదికపైకి పిలిచి పట్టాలు అందజేశారు. ఇది తమ జీవితంలో ఊహించని అద్భుతం అని వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆదిత్య ‘సింజెంటా (Syngenta)’ సంస్థలో ఫుల్-టైమ్ డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం సాధించాడు. తన చిన్న కుమారుడు 12వ తరగతి చదువుతున్నందున జిగీశ కొద్దిరోజులు విరామం తీసుకుని, ఆ తర్వాత మరింత మెరుగైన నైపుణ్యాలతో మళ్లీ అధ్యాపక వృత్తిలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

Next Story