అరుదైన ప్రసవం: ఐదు రోజుల్లో నలుగురు శిశువులకు జననం.. అన్నీ సాధారణ కాన్పులే!

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత అరుదైన వైద్య అద్భుతం చోటుచేసుకుంది. ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించగా.. ఆశ్చర్యకరంగా ఐదు రోజుల వ్యవధిలో ఈ జననాలు జరిగాయి.

అరుదైన ప్రసవం: ఐదు రోజుల్లో నలుగురు శిశువులకు జననం.. అన్నీ సాధారణ కాన్పులే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత అరుదైన వైద్య అద్భుతం చోటుచేసుకుంది. ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించగా.. ఆశ్చర్యకరంగా ఐదు రోజుల వ్యవధిలో ఈ జననాలు జరిగాయి. హై-రిస్క్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ ఎలాంటి సిజేరియన్ (ఆపరేషన్) లేకుండా నలుగురూ సాధారణంగానే (Normal Delivery) జన్మించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. యూపీలోని సంభాల్‌ జిల్లా ఓబ్రీ గ్రామానికి చెందిన అమీనా (31) అనే మహిళ గర్భం దాల్చింది. రెండో నెలలో చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఆమె గర్భంలో నాలుగు పిండాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది చాలా సంక్లిష్టమైన గర్భం కావడంతో పాటు, అమీనా బీపీ, కాలేయ సమస్యలతో బాధపడటంతో పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

ఐదు రోజుల వ్యవధిలో ప్రసవాలు

ప్రసవ నొప్పులు రావడంతో మే 8న మురాదాబాద్‌లోని టీఎంయూ (TMU) ఆసుపత్రిలో అమీనా చేరింది. మే 9న ఆమె ఒక మగబిడ్డకు (710 గ్రాముల బరువు) జన్మనిచ్చింది. అప్పటికి ఆమెకు ఆరున్నర-ఏడు నెలల గర్భం మాత్రమే కావడంతో, వైద్యులు చాకచక్యంగా వ్యవహరించి మిగతా ప్రసవాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఐదు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అమీనాకు మే 14న మళ్లీ నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె మిగిలిన ముగ్గురు శిశువులకు (ఒక బాబు, ఇద్దరు పాపలు) సాధారణ పద్ధతిలో జన్మనిచ్చింది.

తల్లి, బిడ్డలు సురక్షితం

సాధారణంగా ఇలాంటి హై-రిస్క్ కేసుల్లో సిజేరియన్ చేయడమే ఆనవాయితీ అని, కానీ ప్రాణాపాయం ఉన్నప్పటికీ నాలుగు సాధారణ ప్రసవాలు విజయవంతంగా జరగడం వైద్యపరంగా చాలా అరుదైన విషయమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లి, నలుగురు బిడ్డలు సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తొలి బిడ్డ తల్లి పాలు తాగుతూ నిలకడగా ఉండగా, మిగిలిన వారిలో ఒకరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఇద్దరు మాత్రం ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ అరుదైన ప్రసవాన్ని విజయవంతం చేసిన డాక్టర్ల బృందానికి పిల్లల తండ్రి, కిరాణా వ్యాపారి మహ్మద్ ఆలిమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story