Pahalgam Attack: పెహల్గాం దాడికి నెల రోజులు

by S Gopi |   (  Updated:2025-05-22 07:16:39  IST  )

సాక్షులను ప్రశ్నించడం, డిజిటల్ డేటాను విశ్లేషించడం కొనసాగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

Pahalgam Attack: పెహల్గాం దాడికి నెల రోజులు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగి నెల రోజులు పూర్తయింది. ఈ ఘటనకు సంబంధించి నేరస్థులను గుర్తించేందుకు పెద్ద ఎత్తున సోదాలు, ఇంటిలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు నిఘా, దర్యాప్తు చేపట్టాయి. అయినప్పటికీ దాడికి సంబంధించి ఎలాంటి పురోగతి సాధించలేకపోయాయి. ఏప్రిల్ 22న జరిగిన దాడి తర్వాత జమ్మూకశ్మీర్ పోలీసుల నుంచి దర్యాప్తును స్వాధీనం చేసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), దాడి చేసిన వారిని గుర్తించడానికి సాక్షులను ప్రశ్నించడం, డిజిటల్ డేటాను విశ్లేషించడం కొనసాగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. పెహల్గాం సమీపంలోని బైసరన్ మైదానంలో జరిగిన దాడిలో ముగ్గురు పాకిస్తానీ పౌరులతో సహా కనీసం ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని భావిస్తున్నారు. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు, స్థానిక గైడ్ ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా (ఎల్ఈటీ) షాడో సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ మారణహోమానికి పాల్పడినట్టు ప్రకటించుకుంది.

దాడి జరిగిన వెంటనే, స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్, హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, ఆదిల్ భాయ్ అలియాస్ తల్హా భాయ్‌గా గుర్తించిన అధికారులు, వారితో పాటు మరో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశారు. ఈ ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులు గత ఒకటి రెండు సంవత్సరాలుగా కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురి గురించి సమాచారం అందించే వారికి రూ. 20 లక్షల రివార్డును కూడా ప్రకటించారు.

సమగ్ర విచారణ

దాడి జరిగినప్పటి నుంచి సీనియర్ ఎన్ఐఏ అధికారులు పెహల్గామ్‌లోనే మకాం వేసి, స్థానిక పోలీసులు, నిఘా విభాగాలతో కలిసి పనిచేస్తున్నారు. అధికారికంగా కేసు నమోదు చేసిన తర్వాత.. పోనీ హ్యాండ్లర్లు, దుకాణదారులు, పర్యాటక ఫోటోగ్రాఫర్లు, అడ్వెంచర్ స్పోర్ట్స్ వర్కర్స్ సహా 150 మందికి పైగా వ్యక్తులను ఎన్ఐఏ ప్రశ్నించింది. అయితే వారిపై ఎటువంటి నేరారోపణ ఆధారాలు లభించకపోవడంతో చాలా మందిని విడుదల చేశారు. పర్యాటకులు, బాధితుల కుటుంబ సభ్యులు తీసిన ఫోటోలు, వీడియోలతో సహా దాడి జరిగిన ప్రదేశం నుంచి చాలా డేటాను కూడా సేకరించారు. ఆధారాల కోసం మెటీరియల్‌ను స్కాన్ చేయడానికి సాంకేతిక నిఘా సాధనాలనూ ఉపయోగించారు. ప్రత్యక్ష సాక్షుల ఖాతాలు, స్థానికుల సమాచారం ఆధారంగా బైసరన్ మైదానం 3డీ మ్యాపింగ్ కూడా పూర్తి చేశారు.

కమ్యూనికేషన్ మానేసిన ఉగ్రవాదులు

కొన్ని డిజిటల్ లీడ్‌లు లభించాయని, కమ్యూనికేషన్‌, లొకేషన్ పింగ్‌లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే, దాడి జరిగిన వెంటనే ఉగ్రవాదులు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది, ఇది దర్యాప్తును అడ్డగిస్తోందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను వాడటం మానేశారు. నిఘా నుంచి తప్పించుకునేందుకు వారి ఇలాంటి మార్గాలు ఎంచుకున్నారని ఓ అధికారి వివరించారు. దాడి తర్వాత ఉగ్రవాదులు అటవీ ప్రాంతాలలోకి వెళ్లి ఉండవచ్చు. లేదా ఇతర జిల్లాలకు పారిపోయేందుకు వీలుగా సురక్షిత మార్గాలను ఎంచుకొని ఉండొచ్చు. స్థానికులతో సంబంధాలను వదులుకుని ఉంటారు. పర్వత ప్రాంతాలు, దట్టమైన అటవీ భూభాగంలో ఉగ్రవాదులను వేటాడటం సంక్లిష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికీ కశ్మీర్ అంతటా భద్రతను అత్యంత కట్టుదిట్టంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా త్వరలో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని దాడులు జరగకముందే ముప్పును కనిపెట్టాల్సిన లక్ష్యం నిఘా సంస్థల ముందు ఉంది.

Next Story