యూట్యూబర్లను పాక్ స్పైలుగా మార్చే ‘మేడమ్ N’.. 500 స్లీపర్ సెల్స్‌ను రెడీ చేయడమే టార్గెట్

by Phanindra |

యూట్యూబర్లను పాక్ స్పైలుగా మారుస్తున్నది ‘మేడమ్ N’ అనే మహిళ. 500 స్లీపర్ సెల్స్‌ను రెడీ చేయడమే ఆమె టార్గెట్!

యూట్యూబర్లను పాక్ స్పైలుగా మార్చే ‘మేడమ్ N’.. 500 స్లీపర్ సెల్స్‌ను రెడీ చేయడమే టార్గెట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్ ఎజెండాను ప్రచారం చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లొచ్చిన యూట్యూబర్లందరిపైనా ఫోకస్ పెట్టారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. వినిపిస్తున్న పేరు ‘మేడమ్ ఎన్’. జ్యోతి మల్హోత్రా సహా పాక్ స్పైలుగా మారారని అనుమానించిన ఇన్‌ఫ్లుయెన్సర్ల విచారణంలో ఈ ‘మేడమ్ ఎన్’ ప్రస్తావన చాలాసార్లు వచ్చినట్లు సమాచారం. ఆమె పేరు నోషాబా షెహజాద్ అని ఆ తర్వాత వెల్లడైంది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ‘జేయానా ట్రావెల్ అండ్ టూరిజం’ అనే కంపెనీ నడుపుతున్న ఆమె.. చాలామంది భారతీయులకు పాకిస్తాన్‌కు రావడంలో సహకారం అందించింది.

పాకిస్తాన్ సీక్రెట్ సర్వీస్ ఐఎస్ఐ (ఇంటర్ స్టేట్ ఇంటెలిజెన్స్), పాక్ ఆర్మీతో నోషాబాకు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆమె సహకారంతో భారత్‌లో కనీసం 500 మంది గూఢచారులతో స్లీపర్ సెల్ వ్యవస్థను తయారు చేయడం పాక్ లక్ష్యం. ఈ స్లీపర్ సెల్స్ భారతీయులే కావడంతో ఎవరికీ అనుమానం కూడా రాదు కదా. ఈ మిషన్‌లో పనిచేస్తున్న నోషాబాకు ఐఎస్ఐ ఇచ్చిన కోడ్ నేమ్ ‘మేడమ్ ఎన్’. ఆమె భర్త పాకిస్తాన్ సివిల్ సర్వీస్ అధికారిగా పని చేసి రిటైరయ్యాడు. ఆ తర్వాతే పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఆమెను అప్రోచ్ అయ్యాయట. అప్పటి నుంచి వారి సూచనల మేరకు నోషాబా పని చేస్తూ, భారత్‌లో స్లీపర్ సెల్స్ వ్యవస్థను తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. భారతీయ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఐఎస్ఐ, పాక్ ఆర్మీ అధికారులను పరిచయం చేయడంలో నోషాబాదే కీలక పాత్ర.

ముఖ్యంగా హిందూ, సిక్కు యువతను టార్గెట్ చేసే ఆమె.. గత ఆరు నెలల కాలంలోనే కనీసం 3 వేల మంది భారతీయులు, 1500 మంది ఎన్నారైలను పాకిస్తాన్‌కు తీసుకెళ్లింది. ఐఎస్ఐ, పాక్ ఆర్మీ పరిచయాలతో సిస్టంలో బాగా ఎదిగిన ఆమె.. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో ఫస్ట్ సెక్రటరీ (వీసా) సుహైల్ ఖమర్, కౌన్సిలర్ (ట్రేడ్) ఉమర్ షేర్యార్‌తో కూడా టచ్‌లో ఉండేదని సమాచారం. జ్యోతి మల్హోత్రా వంటి వారిని పాకిస్తాన్ గూఢచారులుగా మార్చడంలో ఆమె ఎంతలా సక్సెస్ అయిందంటే.. ఆమె ఒక్క కాల్ చేసి ఫలానా భారత వ్యక్తికి పాక్ వీసా కావాలి అంటే వెంటనే విజిటింగ్ వీసా వచ్చేస్తుంది. సాధారణంగా భారతీయులను పాక్‌కు పంపడానికి ఎలాంటి టూరిజం వ్యవస్థలు లేవు. కానీ ‘మేడమ్ ఎన్’ ఒక్క కాల్ చేస్తే ఎవరైనా భారత్ నుంచి పాక్‌కు వెళ్లిపోవచ్చన్నమాట.

ఢిల్లీలోని ఎంబసీ నుంచి భారత్ వెళ్లగొట్టిన ఐఎస్‌ఐ ఆపరేటివ్ ఎహసాన్-ఉర్-రెహ్మాన్ అలియాజ్ డానిష్‌తో నోషాబాకు మంచి రిలేషన్ ఉన్నట్లు దర్యాప్తులో తేలిందట. జ్యోతి మల్హోత్రా అరెస్టయిన తర్వాత, ఆమెకు డానిష్‌తో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. అప్పుడే డానిష్‌కు ఐఎస్ఐ రిలేషన్ ఉన్నట్లు తెలుసుకున్న ప్రభుత్వం.. అతన్ని భారత్‌ నుంచి వెళ్లగొట్టింది. పాకిస్తా్న్‌లో ఉన్న కొన్ని చోట్లకు భారతీయులు తీర్థయాత్రలకు వెళ్తారన్న సంగతి తెలిసిందే. ఆ తీర్థయాత్రలన్నీ కూడా కేవలం నోషాబాకు చెందిన కంపెనీ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. మరే సంస్థా ఈ వ్యాపారంలో వేలు పెట్టకుండా పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అనధికారికంగా అడ్డుపడినట్లు తెలుస్తోంది. ఇలా భారతీయుల తీర్థయాత్రల వల్ల డబ్బులు సంపాదించి, ఆ సొమ్మును భారత్‌లో స్లీపర్ సెల్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నోషాబా ఉపయోగిస్తుందన్నమాట. ఇటీవలే ఢిల్లీలో కొందరు ట్రావెల్ ఏజెంట్లను కూడా నోషాబా సంప్రదించిందని, వాళ్లు కూడా ఆమె కంపెనీని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారని తేలింది. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ‘మేడమ్ ఎన్’ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Next Story