రహస్యంగా ఆ దేశంలో చైనా అధ్యక్షుడి కుమార్తె.. మీడియా ముందుకు లాక్కొస్తానని ఓ కీలక నేత సంచలన ప్రకటన

by Yella Dhawani Reddy |

అమెరికా, చైనా మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

రహస్యంగా ఆ దేశంలో చైనా అధ్యక్షుడి కుమార్తె.. మీడియా ముందుకు లాక్కొస్తానని ఓ కీలక నేత సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, చైనా (America-China) మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. వాణిజ్యం, సైనిక వ్యవహారాలు, సాంకేతిక ఆధిపత్యం లాంటి కీలక రంగాల్లో ఈ రెండు దేశాలు ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) కుమార్తె జి మింగ్జ్‌ (Xi Mingze) అమెరికాలో అత్యంత రహస్యంగా జీవిస్తోందనే వార్తలు తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హార్వర్డ్ యూనివర్శిటీలో (Harvard University) చదువుకున్న ఆమె నకిలీ పేరుతో మసాచుసెట్స్ ప్రాంతంలో అత్యంత భద్రత మధ్య రహస్యంగా జీవిస్తోందని అమెరికాకు చెందిన రాజకీయ కార్యకర్త లారా లూమర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజానికి జిన్‌పింగ్ కుటుంబ సభ్యుల జీవితం గురించి చాలా అరుదుగా వివరాలు బయటపడతాయి. అలాంటిది ఆయన కుమార్తె గురించి ఇలాంటి వివాదాస్పద వార్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తోన్నాయి. మింగ్జి (Xi Mingze)ను కెమెరా ముందుకు తీసుకొచ్చి ఆమె తండ్రి విధానాల గురించి ప్రశ్నిస్తానంటూ లూమర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులు తమ దేశానికి చెందినవారు కాదని ఆమె వ్యాఖ్యానించారు. లూమర్‌ వ్యాఖ్యలతో జి మింగ్జి అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

కాగా, జి.మింగ్జ్ 2010లో హార్వర్డ్ యూనివర్శిటీలో అడ్మిషన్ పొందింది. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె పేరు కూడా పూర్తిగా రహస్యంగా ఉంచబడింది. ఆమె చెంగ్ జి అనే నకిలీ పేరుతో చదువుకుందని రూమర్లు ఉన్నాయి. విద్య పూర్తయ్యాక, చైనాకు తిరిగిపోయిందా లేక అమెరికాలోనే ఉండిపోయిందా అన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. మింగ్జి ఉంటున్న ప్రాంతం, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చైనా అధికారులు ఎప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆమె ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. తాజాగా, అమెరికాలో ఉన్న రైట్‌వింగ్ (వలసవాద భావాల) రాజకీయ కార్యకర్త లారా లూమర్ చేసిన వ్యాఖ్యలతో ఆమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అయితే, చైనా అధికారికంగా దీనిపై స్పందించలేదు. కానీ అమెరికాలో రాజకీయ దళాల మధ్య ఈ అంశం కీలకంగా మారింది.

Next Story