- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ విషయంలో మాటలకే పరిమితమైన చైనా.. నో యాక్షన్ వెనుక 'మిస్టరీ బ్యాంక్'?
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో చైనా మౌనం వెనుక ఉన్న రహస్య కారణాలపైఆసక్తికర చర్చ జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో తమ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. తమ ప్రత్యర్థులతో పాటు ప్రత్యర్థులకు పరోక్షంగా సహాయపడుతున్న గల్ఫ్ దేశాలపై రివర్స్ ఎటాక్ చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‍కు పలు మిలిటెంట్ గ్రూపులు మద్దతు ఇస్తుండగా అమెరికా, ఇజ్రాయెల్‍కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు బ్రిటన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇరాన్‍పై మరింత భీకర దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచ దేశాల్లో ఆందోళనలు పుట్టిస్తున్నాయి.
కేవలం మాటలకే పరిమితం:
యుద్ధం విస్తరిస్తున్న క్రమంలో ఇరాన్‍కు మిత్ర దేశంగా ఉన్న చైనా, రష్యాలు కేవలం మాటలకే పరిమితం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందనే టాక్ అంతర్జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది. కష్టకాలంలో తమ మిత్రదేశమైన ఇరాన్‍కు పూర్తిస్థాయిలో అండగా నిలిచేందుకు చైనా, రష్యా యుద్ధక్షే త్రంలోకి దిగుతాయని భావిస్తుండగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. సైనిక సత్తా పరంగా చైనా, రష్యా ఈ రెండు అమెరికాతో తలబడే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నవే. కానీ ఇటీవల పరిణామాల్లో ఈ రెండు దేశాలు అనుసరిస్తున్న వైఖరి అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారుతున్నాయి.
అప్పుడు ఇప్పుడూ సైలెంటే:
ఈ ఏడాది జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు కిడ్నాప్ చేసినప్పుడు రష్యా, చైనా మిన్నకుండిపోయాయి. కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయి. తాజాగా ఇరాన్‍పై అమెరికా దాడుల్లో ఖమేనీ మరణించినా ఈ రెండు దేశాలు తమ మిత్రదేశం కోసం ఏమి చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‍తో బలమైన రక్షణ, వ్యాపార, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నప్పటికీ చైనా కేవలం ఖండన మాటలకే పరిమితం అయింది. నిజానికి చైనాకు చమురు అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో ఇరాన్ ఒకటిగా ఉంది. చైనా ఇరాన్ నుండి నెలకు సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన చమురును కొనుగోలు చేస్తోంది. ఇటువంటి చైనా మౌనం వహించడం వెనుక ఏం రీజన్ ఉందనే చర్చ జరుగుతోంది.
మిత్రదేశం అంటూనే..:
అయితే ఇరాన్ పై జరుగుతున్న దాడులపై తాజాగా చైనా స్పందించింది. ఇరాన్ తమకు మిత్రదేశం అని ప్రకటించింది. ఇరాన్ తన ప్రయోజనాలను, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకోవడానికి మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ చేస్తోన్న ప్రతీకార దాడులకు మాత్రం మద్దతు ఇవ్వలేమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టం చేశారు. ఇరాన్‍కు సైనిక సాయం గానీ ఆయుధసాయం గానీ చేయడం లేదని ఆయన వెల్లడించారు. అయితే చైనా పాటిస్తున్న ఈ మౌనం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయనే చర్చ వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 31న చైనా రాజధాని బీజింగ్‍లో పర్యటించనున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ అంశంపై అతిగా స్పందిస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయేమోనన్న ఆందోళనతోనే డ్రాగన్ కంట్రీ ఇటు ఖమేనీ హత్య, ఇరాన్ పై దాడులు, అంతకు ముందు వెనెజువెలా నేత మదురో కిడ్నాప్ అంశాలపై సైలెంట్ ఆచితూచి వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మిస్టరీ బ్యాంకు:
దీనికి తోడు చైనా మౌనం వెనుక బీజింగ్ లో మిస్టరీ బ్యాంకు కోణం కూడా ఓ కారణం అనే వాదన తెరపైకి వస్తోంది. చైనా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడమే కాకుండా అమెరికా డాలర్ ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్‌ను ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరాన్ నుంచి చైనా కొనుగోలు చేస్తున్న చమురు వ్యాపారం అంతా చైనా కరెన్సీ యువాన్‍లో జరుగుతోంది. ఆ డబ్బుతో ఇరాన్ చైనా నుండి యంత్రాలను, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తోంది. దీంతో ఆ సొమ్ము తిరిగి చైనా ఆర్థిక వ్యవస్థలోనే ఉండిపోతోంది. అమెరికా డాలర్ అవసరం లేకుండా ఈ మొత్తం లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఈ లావాదేవీలకు చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ (CNPC) నియంత్రణలో ఉన్న 'బ్యాంక్ ఆఫ్ కున్లున్' ఒక ఆర్థిక వారధిగా మారింది. 2012లో అమెరికా ట్రెజరీ శాఖ ఈ బ్యాంక్ ఆఫ్ కున్లున్‌పై ఆంక్షలు విధించింది. అయినా చైనా ఈ విధానం కొనసాగిస్తూనే వస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ సంఘర్షణ విషయంలో బహిరంగంగా తలదూర్చితే ఇబ్బందులు తప్పవనే చైనా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తోందనే చర్చ జరుగుతోంది.
యుద్ధ రంగంలోకి దిగితే?:
ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల మేరకు ఇరాన్ కు మద్దతుగా చైనా యుద్ధక్షేత్రం లోకి దిగితే ఏం జరగబోతోందనే విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ కు మద్దతుగా చైనా, రష్యాలు వస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే చర్చ జరుగుతోంది. మరో వైపు యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.






