భార్యకు క్యాన్సర్ తగ్గడంలేదని కుటుంబం ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న ‘చివరి వీడియో’

by Ramesh Naini |   (  Updated:2026-02-03 11:05:10  IST  )

కట్టుకున్న భార్య క్యాన్సర్ బారిన పడి, బతికే అవకాశాలు లేవని తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ ప్రభుత్వ ఉద్యోగి, భార్య, పదేళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన కోయంబత్తూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

భార్యకు క్యాన్సర్ తగ్గడంలేదని కుటుంబం ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న ‘చివరి వీడియో’
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్యాన్సర్ మహమ్మారి ఓ కుటుంబాన్ని చిదిమేసింది. కట్టుకున్న భార్య క్యాన్సర్ బారిన పడి, బతికే అవకాశాలు లేవని తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ ప్రభుత్వ ఉద్యోగి, భార్య, పదేళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన కోయంబత్తూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా పెరియనాయక్కన్‌ పాళైయం సమీపంలోని తంబు నగర్‌కు చెందిన బి. కమలేశ్ (42) తమిళనాడు విద్యుత్ బోర్డులో జూనియర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ఇలక్కియా (38) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. వీరికి ఐదో తరగతి చదువుతున్న యక్షిత ఏంజెల్ (10) అనే కుమార్తె ఉంది.

గత రెండేళ్లుగా ఇలక్కియా రొమ్ము క్యాన్సర్‌..

గత రెండేళ్లుగా ఇలక్కియా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఇటీవల వైద్య పరీక్షల అనంతరం క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకిందని, ఆమె కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. భార్య పడుతున్న నరకయాతనను చూడలేక, ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేక కమలేశ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. భార్య ఆరోగ్యం కుదుటపడకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్న కమలేశ్, సైనైడ్ కొనుగోలు చేసి ఆదివారం రాత్రి కూల్ డ్రింక్‌లో కలిపారు. దానిని భార్యాబిడ్డతో కలిసి సేవించి ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కంటతడి పెట్టిస్తున్న ‘చివరి వీడియో’

ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు కమలేశ్ తన బంధువులు, స్నేహితులు, చర్చి సభ్యులకు ఒక సెల్ఫీ వీడియోను పంపించారు. భార్య అనారోగ్యం కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ‘మా అంత్యక్రియల కోసం రూ. 50,000 చర్చి ఖాతాకు బదిలీ చేశాను. నా ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బును కూడా చర్చికి ఇస్తున్నాను. దయచేసి మా మృతదేహాలకు పోస్టుమార్టం చేయవద్దు’ అని అర్థించారు. అంతేకాకుండా, తన ఉద్యోగం ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను (Benefits) రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలని తమిళనాడు ముఖ్యమంత్రిని ఆ వీడియోలో కోరడం అందరినీ కలిచివేసింది. వీడియో చూసిన బంధువులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునేసరికి ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పెరియనాయక్కన్‌ పాళైయం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story