Bangladesh: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి.. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం

by Shamantha N |

బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది నవంబర్ 26 నుంచి జనవరి 25 వరకు హిందువులే లక్ష్యంగా 76 దాడులు జరిగినట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్ సభలో వెల్లడించారు.

Bangladesh: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి.. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది నవంబర్ 26 నుంచి జనవరి 25 వరకు హిందువులే లక్ష్యంగా 76 దాడులు జరిగినట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్ సభలో వెల్లడించారు. ఈమేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరుగుతున్న హింస ఆందోళనకరమని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు నుంచి 23 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారని.. 152 హిందూ దేవాలయాలపై దాడి జరిగిందని తెలిపారు. "గతేడాది డిసెంబర్ 9న విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా హిందువులు, మైనారిటీల రక్షణకు సంబంధించి అక్కడి ప్రభుత్వంతో చర్చించారు" అని సింగ్ అన్నారు. మైనారిటీలతో సహా బంగ్లాదేశ్ పౌరులందరి జీవితం, స్వేచ్ఛను రక్షించే ప్రాథమిక బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఉందన్నారు. ఢాకాలోని భారత హైకమిషన్ మైనారిటీలకు సంబంధించిన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందని చెప్పుకొచ్చారు.

షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక..

షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ఆమె దేశంవదిలి వెళ్లిపోయాక మైనారిటీలపై దాడుల కేసులు భారీగా పెరిగిపోయాయి. అయితే, నిందితులను శిక్షించడానికి బంగ్లాదేశ్ చర్యలు తీసుకోలేదని భారతదేశం ఆరోపించింది. కాగా.. ఈ సమయంలో బంగ్లాతో చర్చలు జరిగాయి. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ 10న మైనారిటీలపై దాడులకు సంబంధించిన 88 కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్లు బంగ్లా అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్ అధికారుల దర్యాప్తులో మైనారిటీ వర్గాలపై 1,254 హింసాత్మక ఘటనలు జరిగినట్లు వెల్లడైంది.

Next Story