Cloud Burst: జమ్మూకశ్మీర్ కఠువాలో క్లౌడ్‌బరస్ట్.. ఏడుగురు మృతి

by S Gopi |

జోధ్ ఘాటిలో సంభవించిన వరదల కారణంగా ఐదుగురు మరణించారు, జాంగ్లోట్‌లో కొండచరియలు విరిగిపడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Cloud Burst: జమ్మూకశ్మీర్ కఠువాలో క్లౌడ్‌బరస్ట్.. ఏడుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలలో మరోసారి క్లౌడ్‌బరస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారని అధికారులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇటీవలే కిష్త్‌వాడ్‌లో క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో పాటు ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గల్లంతైన సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జోధ్ ఘాటిలో సంభవించిన వరదల కారణంగా ఐదుగురు మరణించారు, జాంగ్లోట్‌లో కొండచరియలు విరిగిపడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జోధ్ ఘాటీ సమీపంలో ఉన్న కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద ఓ కుటుంబం చిక్కుకున్నట్టు సమాచారం. క్లౌడ్‌బరస్ట్ వల్ల జోధ్‌ఘాటి గ్రామానికి రాకపోకలు ఆగిపోయాయని, తీవ్రస్థాయిలో నష్టం ఏర్పడింది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పౌర పరిపాలన అధికారులు, సైనిక, పారామిలిటరీ దళాలు తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కఠువా సీనియర్ పోలీసు అధికారిచెప్పారు. ఉధంపూర్‌ ఎంపీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఘటన గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్, ఎన్‌హెచ్-44, ఒక పోలీస్ స్టేషన్ కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. అధికారులతో మాట్లాడానని, కఠువా ఎస్పీ శోభిత్ సక్సేనాతో మాట్లాడి, జోధ్‌ఘాటి గ్రామంలో సహాయక చర్యలు కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్టు స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్లౌడ్‌బరస్ట్, కొండచరియలు విరిగిపడటంతో కఠువా జిల్లాలోని ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, సహాయ, రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విషాదంలో ఉన్న కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అవసరమైన సహాయం అందుతుందని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు, క్లౌడ్ బరస్ట్ తర్వాత కఠువా పరిపాలన యంత్రాంగం వాతావరణానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Next Story