పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్లు తొలగింపు.. రాజకీయ దుమారం!

by Ramesh Naini |

ప్రత్యేక ఓటరు సర్వే (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR) అనంతరం పశ్చిమ బెంగాల్‌లో ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు.

పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్లు తొలగింపు.. రాజకీయ దుమారం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రత్యేక ఓటరు సర్వే (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR) అనంతరం పశ్చిమ బెంగాల్‌లో ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. తొలగించిన ఓట్లలో 24 లక్షల మంది మరణించినవారిగా, 19 లక్షల మంది ఇతర ప్రాంతాలకు స్థిరపడ్డ వారీగా, 12 లక్షల మంది ‘కనిపించని’ ఓటర్లుగా, అలాగే 1.3 లక్షల మంది ద్వంద్వ నమోదులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ముసాయిదా జాబితా విడుదలతో SIR తొలి దశ ముగిసినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. తప్పుగా తమ పేర్లు తొలగించబడ్డాయని భావించే వారు అభ్యంతరాలు నమోదు చేసి సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అన్ని అభ్యంతరాల పరిష్కారం అనంతరం ఫిబ్రవరిలో తుది ఓటరు జాబితా విడుదల కానుంది.

ఈ పరిణామం ఎన్నికలకు సిద్ధమవుతున్న బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ ఈ చర్యను ‘తీవ్ర అన్యాయం’గా అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లోని చట్టబద్ధ ఓటర్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, మా పార్టీ ఓటర్ అసిస్టెన్స్ బూత్‌లు ఏర్పాటు చేసి, పేర్లు తిరిగి చేర్చుకునేలా సహాయం చేస్తుందని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే SIR ప్రక్రియకు వ్యతిరేకంగా గళమెత్తిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు లక్షలాది అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ మాత్రం తృణమూల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అక్రమ వలసదారులు, నకిలీ ఓటర్లను కాపాడుకోవడానికే మమతా బెనర్జీ ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత సువేందు అధికారీ విమర్శించారు.

Next Story