మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ.. 51 మంది సరెండర్

by Prasad Jukanti |   (  Updated:2026-02-07 13:12:27  IST  )

ఈ దేశంలో మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రతినబూనిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కొనసాగిస్తోంది.

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ.. 51 మంది సరెండర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‍లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మొత్తం 51 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బస్తర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు జరిగిన లొంగుబాట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సుక్మాలో మొత్తం 21 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్, ఎస్పీ కిరణ్ చవాన్, సీఆర్పీఎఫ్ డీఐజీ ఆనంద్ సింగ్ రాజ్ పురోహిత్ ఎదుట వీరంతా సరెండర్ కాగా వీరందరిపై రూ. 74 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు ఎస్‌ఎల్‌ఆర్, ఏకే-47, బిజిల్ లాంచర్ సహా పలు ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇప్పటివరకు అనేక విధ్వంసకర ఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో మరో30 మంది మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో చేరారు. వీరంతా పోలీస్, సీఆర్‍పీఎఫ్ సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇరవై మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారిపై ఎనభై ఐదు లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.

బీజాపూర్ సరెండర్లపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి స్పందించారు. బస్తర్ ప్రాంతంలో శాంతి, విశ్వాసం, అభివృద్ధి దిశగా మా నిరంతర ప్రయత్నాలకు ఈ సరెండర్లు సానుకూల ఫలితం అన్నారు. ఇవాళ బీజాపూర్ జిల్లాలో 30 మంది మావోయిస్టు కేడర్లు పూనా మార్గేం పథకం కింద అజ్ఞాతం వీడారని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా రహదారులు, విద్య, ఆరోగ్యం, కమ్యూనికేషన్ సదుపాయాలు వంటి సమగ్ర అభివృద్ధిని బస్తర్ దూర ప్రాంతాలకు విస్తరించామని, దాంతో దారి తప్పిన యువత హింసను విడిచి ప్రధాన ప్రవాహంలో చేరేందుకు ప్రేరణ పొందింది. ఇది సుశాసన విధానాల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు.

Next Story