- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో 50 శాతం విమానాల్లో సాంకేతిక లోపాలు.. పార్లమెంటరీ ప్యానెల్ సంచలన నివేదిక
దేశీయ పౌర విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలపై స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశీయ పౌర విమానయాన రంగంలో (Civil Aviation) భద్రతా ప్రమాణాలపై స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో నడుస్తున్న వాణిజ్య విమానాల్లో దాదాపు 50 శాతం విమానాల్లో పదే పదే సాంకేతిక లోపాలు తలెత్తుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానయాన భద్రతా వ్యవస్థలో సమూల మార్పులు (Fundamental reset) అవసరమని స్పష్టం చేసింది.
నివేదికలోని కీలక అంశాలు..
2025 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి మధ్య దేశవ్యాప్తంగా 754 విమానాలను ఆడిట్ చేయగా.. ఏకంగా 377 విమానాల్లో తరచూ ఒకే తరహా లోపాలు రిపీట్ అవుతున్నట్లు కమిటీ గుర్తించింది. ఆడిట్ చేసిన వాటిలో అత్యధికంగా ఇండిగోకు చెందిన 405 విమానాలు ఉండగా, 148 ఫ్లైట్లలో లోపాలు బయటపడ్డాయి. అలాగే ఎయిరిండియాకు చెందిన 166 విమానాల్లో 137, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 101 విమానాల్లో 54 విమానాలు లోపాలతో నడుస్తున్నాయి. మొత్తం లోపాల్లో సగానికి పైగా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకే చెందినవి కావడం గమనార్హం.
సాంకేతిక లోపాలే కాకుండా..
2025 జులైలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత డీజీసీఏ (DGCA) చేసిన తనిఖీల్లో సుమారు 100 భద్రతా వైఫల్యాలు వెలుగుచూశాయి. సాంకేతిక లోపాలే కాకుండా.. బోయింగ్ 787, 777 విమానాల పైలట్ల శిక్షణలో ఖాళీలు, అంతర్జాతీయ ప్రయాణాల్లో తగినంత మంది క్యాబిన్ క్రూ లేకపోవడం వంటివి కమిటీ ప్రస్తావించింది. మిలన్ - న్యూఢిల్లీ విమానంలో సిబ్బంది పనివేళల నిబంధనలను (Flight Duty Time Limitations) ఉల్లంఘించి, అనుమతించిన దానికంటే అదనంగా రెండు గంటలు పని చేయించినట్లు వెల్లడించింది. ఈ స్థాయి లోపాలు ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేయడమే కాకుండా, విమానయాన సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని కమిటీ హెచ్చరించింది. భద్రతా ప్రమాణాల విషయంలో మరింత పర్యవేక్షణ, కఠిన అమలు, మెరుగైన శిక్షణ అత్యవసరమని నొక్కి చెప్పింది.






