- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌లో 400 కేజీల యురేనియం మిస్సింగ్.. ఆందోళనలో యూఎస్!
ఇరాన్‌లో యూఎస్ దాడుల తర్వాత 400 కేజీల యురేనియం కనిపించకుండా పోయింది. దీంతో యూఎస్ టెన్షన్ పడుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇరాన్‌లోని యురేనియం నిల్వల్లో 400 కేజీలు కనిపించడం లేదని, ఈ మొత్తంతో కనీసం 10 న్యూక్లియర్ బాంబులు తయారుచేయొచ్చని వాన్స్ అన్నారు. ఇరాన్‌లోని మూడు కీలక న్యూక్లియర్ స్థావరాలపై యూఎస్ దాడులు చేసిన తర్వాత ఇది జరిగినట్లు సమాచారం. ఈ యురేనియం 60 శాతం శుద్ధి చేసిందట. అణ్వాయుధాలు తయారు చేసేందుకు 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం అవుతుంది. అంటే కనిపించకుండా పోయిన యురేనియాన్ని మరింత శుద్ధిచేసి, అణ్వాయుధాలు తయారు చేయొచ్చన్నమాట.
సరిగ్గా యూఎస్ దాడులు చేయడానికి రెండ్రోజుల ముందు ఇరాన్‌లోని ఫోర్దో న్యూక్లియర్ సైట్ వద్ద 16 భారీ ట్రక్కులు కనిపించాయి. ఈ దాడుల తర్వాత ఈ ప్రాంతంలో చాలా నష్టం జరిగినప్పటికీ ఈ ట్రక్కులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ విషయాన్ని శాటిలైట్ చిత్రాలు స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో కనిపించకుండా పోయిన 400 కేజీల యురేనియాన్ని మరో కీలక న్యూక్లియర్ స్థావరమైన ఇస్ఫహాన్ సమీపంలో ఇరాన్ దాచిపెట్టిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే దీనిపై యూఎస్ వద్ద ఎలాంటి సమాచారం ఉన్నట్లు కనిపించడం లేదు.
ఈ క్రమంలో ఈ మిస్సింగ్ యురేనియం ఎక్కడుందో కనిపెట్టేందుకు యూఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) చీఫ్ రఫేల్ గ్రాసీ కూడా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి వారం రోజుల ముందు తాము అణ్వాయుధాలను ఇన్‌స్పెక్ట్ చేశామని వెల్లడించారు. గతవారం యూఎన్ భద్రతా మండలితో కూడా సాధ్యమైనంత త్వరగా ఐఏఈఏ తనిఖీలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని రఫేల్ నొక్కిచెప్పారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో యూఎస్ జోక్యం చేసుకోవడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాన్-ప్రొలిఫరేషన్ ఒప్పందం నుంచి తప్పుకుంటామని బెదిరించిన ఈ దేశం.. తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లను ఆపడం జరగదని కూడా తేల్చిచెప్పింది. ‘ఏం చెయ్యాలో మాకు ఎవరూ చెప్పలేరు’ అని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి తక్త్ రావంచీ స్పష్టంచేశారు. ఈ క్రమంలో కనిపించకుండా పోయిన 400 కేజీల యురేనియంతో ఎవరికీ తెలియకుండా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకుంటుందని యూఎస్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.






