సుప్రీంకోర్టుకు మరో 4 కొత్త పోస్టులు: న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్ జారీ

by Kema Shiva Kumar |

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను సీజేఐతో కలిపి 34 నుంచి 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు.

సుప్రీంకోర్టుకు మరో 4 కొత్త పోస్టులు: న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టులో (Supreme Court of India) కేసుల పెండింగ్‌ను దృష్టిలోఉంచుకుని వాటిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు అనుగుణంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అధికారికంగా ఇవాళ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. మే 16 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టం, 1956‌లోని సెక్షన్ 2ను సవరించారు. ఇందులో ఉన్న ‘33’ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘37’ అని చేర్చారు. పాత నిబంధన ప్రకారం 33 మంది న్యాయమూర్తులు, ఒకరు సీజేఐ మొత్తం 34 మంది ఉండగా.. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం 37 మంది న్యాయమూర్తులు, ఒకరు సీజేఐ కలిపి మొత్తం 38 మంది ఉంటారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు లేకపోవడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం లభించిన అత్యవసర అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 5న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

93 వేలకు పైగా పెండింగ్ కేసులు..

సుప్రీంకోర్టులో డిజిటలైజేషన్ (E-Filing) ప్రక్రియ పెరిగిన తర్వాత కేసుల నమోదు ఊపందుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య దాదాపు 93 వేల మార్కును దాటిపోయింది. రాబోయే జూన్, ఆగస్టు నెలల్లో మరో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు రిటైర్ కానుండటంతో న్యాయమూర్తుల కొరత ఏర్పడకుండా కేంద్రం ఈ వేగవంతమైన చర్యలు చేపట్టింది. ఈ అదనపు 4 పోస్టుల భర్తీ కూడా సుప్రీం కోర్టు కొలీజియం (Collegium System)‌తో జరగనుంది.

Next Story