Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న రెస్క్యూ.. కొండచరియల కిందే ఇంకో ఐదుగురు

by Shamantha N |

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు కార్మికులు చనిపోయారు. మంచుచరియల కింద చిక్కుకున్న మరో ఐదుగురిని కాపాడేందుకు ఆర్మీ కష్టపడుతోంది.

Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న రెస్క్యూ..  కొండచరియల కిందే ఇంకో ఐదుగురు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు కార్మికులు చనిపోయారు. మంచుచరియల కింద చిక్కుకున్న మరో ఐదుగురిని కాపాడేందుకు ఆర్మీ కష్టపడుతోంది. ఏడు అడుగుల లోతైన మంచులో కూరుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తోంది. రక్షించిన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు జోషిమట్ కు తరలిస్తున్నారు. అందుకోసం మొత్తం ఆరు హెలికాప్టర్లను మోహరించినట్లు డెహ్రాడూన్ అధికారులు(Uttarakhand avalanche rescue) తెలిపారు. గాయపడినవారిని తరలించేందుకు తొలిప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారిని హెలికాప్టర్‌లో జోషిమట్ లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు భారత ఆర్మీ తెలిపింది. ఇప్పటివరకు 23 మందిని జోషిమట్ హాస్పిటల్ కు తరలించినట్లు వెల్లడించింది. రెండోరోజు సెర్చ్ ఆపరేన్ ప్రారంభించిన ఆర్మీ.. మరో 17 మంది సిబ్బందిని రక్షించింది. అయితే, అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తేల్చింది. కాగా.. మొదటి రోజు 33 మందిని కాపాడింది. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

అసలేం జరిగిందంటే?

బద్రీనాథ్‌ క్షేత్రానికి సమీపంలో ఛమోలీ జిల్లాలోని మనా గ్రామం వద్ద శుక్రవారం మంచు చరియలు విరిగిపడ్డాయి. ఇది భారత్‌-టిబెట్‌ సరిహద్దులో మన దేశానికి చెందిన చివరి గ్రామం. జాతీయరహదారిపై భారీగా పేరుకుపోయిన మంచుని సరిహద్దు రహదారుల సంస్థ (BRO) సిబ్బంది తొలగిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ప్రదేశం సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Next Story