Operation Sindoor: 24 మిస్సైల్స్.. 9 టెర్రర్ క్యాంపులు.. 25 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) పేరుతో మెరుపుదాడి చేసింది.

Operation Sindoor: 24 మిస్సైల్స్.. 9 టెర్రర్ క్యాంపులు.. 25 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) పేరుతో మెరుపుదాడి చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావ‌రాలే లక్ష్యంగా భారత్‌ విరుచుకుపడింది. మే 7న తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 వరకు జరిగిన ఈ దాడులను త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టాయి. మొత్తం 9 టెర్రర్ కేంద్రాల‌ను భారత్ టార్గెట్ చేసింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆ ఉగ్రస్థావరాలపై 24 మిస్సైళ్లతో మెరుపు దాడి చేసి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఈ దాడిలో 70 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 60 మంది గాయపడినట్లు సమాచారం. అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ మీడియాతో మాట్లాడారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత కచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు.

ఆపరేషన్ సిందూర్ జరిగింది ఇలా..

‘ఆపరేషన్‌ సిందూర్‌’ జరిపిన తీరును కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్ వ్యోమికా సింగ్‌ వివరించారు. ‘‘పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్‌ చేపట్టాం. గత 30 ఏళ్లుగా పాక్‌ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తోంది. ఆ దేశంతో పాటు పీఓకేలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయి. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించాం. అందులో తొమ్మిదింటిని లక్ష్యంగా చేసుకున్నాం. కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశాం. పాక్‌ పౌరులకు హాని జరగకుండా వాటిని నిర్వహించాం. సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదు. అర్ధరాత్రి 1.05-1.30 గంటల మధ్య ఈ ఆపరేషన్‌ జరిగింది. భారత్‌ టార్గెట్‌ చేసిన వాటిల్లో.. లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో గల లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉంది. ఇక్కడ 26/11 ముంబయి దాడులకు పాల్పలడిన ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీ శిక్షణ తీసుకున్నారు’’ అని కర్నల్‌ సోఫియా ఖురేషి వెల్లడించారు. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్‌ సంగతులను మహిళా అధికారులు వెల్లడించడం విశేషం.

మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం

భారత్ పై మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం అందిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పేర్కొన్నారు. ‘‘భారత్‌పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చాయి. వాటిని అడ్డుకోవడం, ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం అత్యవసరమని భావించాం. కచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశాం. ఇది ఆరంభం మాత్రమే. పాక్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేస్తుందని నమ్ముతున్నాం. అప్పుడే ఉగ్రవాదాన్ని అడ్డుకోగలం’’ అని మిస్రీ వెల్లడించారు.

భారత్‌ టార్గెట్‌ చేసిన తొమ్మిది స్థావరాలు ఇవే..

ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్, రావలకోట్, చక్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్‌లోని టెర్రర్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇవన్నీ నిఘా సంస్థలు ఉగ్రవాద శిబిరాలకు ఆశ్రయం ఇస్తున్నాయని చాలా కాలంగా అనుమానిస్తున్న ప్రాంతాలు. ఈ ప్రదేశాలు లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM) లతో అనుబంధంగా ఉన్నాయని సమాచారం. ఈ రెండు ఉగ్రవాద గ్రూపులు సంవత్సరాలుగా భారతదేశంలో పలు దాడులకు కారణమయ్యాయి. దాడికి గురైన తొమ్మిది ప్రదేశాల్లో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి. నాలుగు పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో ఉన్నాయి. ముఖ్యంగా బహవల్పూర్ జైషే మొహమ్మద్ కు బలమైన స్థావరంగా ఉంది.

Next Story