ఉగ్రదాడుల్లో 20 వేల మంది మృతి.. యూఎన్‌లో పాకిస్తాన్‌ను ఎండగట్టిన భారత్

by Phanindra |

ఉగ్రదాడుల్లో 20 వేల మంది భారతీయులు మృతి చెందారని యూఎన్‌లో భారత్ వెల్లడించింది. పాకిస్తాన్ ఉగ్రచర్యలను ఎండగట్టింది.

ఉగ్రదాడుల్లో 20 వేల మంది మృతి.. యూఎన్‌లో పాకిస్తాన్‌ను ఎండగట్టిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్య సమితిలో సింధూ జలాల ఒప్పందం సమస్యను పాకిస్తాన్ లేవనెత్తింది. ప్రాణాధారమైన నీటిని ఆయుధంగా భారత్ వాడుకుంటోందంటూ ఆరోపణలు చేసింది. దీనికి యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా బదులిచ్చారు. భారత్ ఈ ఒప్పందం విషయంలో ఎప్పుడూ బాధ్యతగానే ప్రవర్తించిందని, కానీ పాకిస్తాన్ మాత్రం ఈ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని పలుమార్లు సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నించిందని ఆయన వెల్లడించారు. 65 ఏళ్ల నాటి ఈ ఒప్పందాన్ని భారత్ గౌరవించినా కూడా.. పాక్ మాత్రం యుద్ధాలు, సీమాంతర ఉగ్రదాడులతో ఒప్పందం గౌరవాన్ని మంటకలిపిందని హరీష్ చెప్పారు. గత నాలుగు దశాబ్దాల్లో భారత్‌పై జరిగిన ఉగ్రదాడుల్లో 20 వేల మందికిపైగా ప్రజలు మరణించారని, అయినా సరే భారత్ చాలా సహనంతో ఈ ఒప్పందాన్ని కొనసాగించిందని వివరించారు. భారతీయుల ప్రాణాలు, మతసామరస్యం, ఆర్థికవృద్ధిని దెబ్బతీసేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఉపయోగించుకుందని ఆయన మండిపడ్డారు.

అలాగే గడిచిన 65 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయని, కేవలం భద్రతా కారణాలే కాకుండా వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ ఉత్పాదన వంటి విషయాల్లో భారత్ పురోగతికి పాకిస్తాన్ అడ్డుపడిందని హరీష్ తెలిపారు. ‘డ్యాంల టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. దీంతో భారత్ వాటా నీటిని మరింత మెరుగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకోసం ఇప్పటికే పాతపడి ప్రమాదకరంగా మారిన డ్యాంలకు మరమ్మతులు చేయడానికి, అలాగే కొన్ని చోట్ల కొత్త డ్యాంలు నిర్మించుకోవడానికి భారత్ ప్రయత్నించినప్పుడల్లా పాకిస్తాన్ అడ్డుకుంది. సింధూ జలాల ఒప్పందంలో అంగీకరించిన పరిమితులకు లోబడి నిర్మాణాలు చేయాలని చూసినా అడ్డంకులు సృష్టించింది’ అని హరీష్ చెప్పారు. దీనికి ఉదాహరణగా 2012లో జమ్మూకశ్మీర్‌లో తుల్‌బుల్ నేవిగేషన్ ప్రాజెక్టుపై ఉగ్రవాదుల దాడిని గుర్తుచేశారు.

‘ఇలాంటి క్రూరమైన చర్యలతో భారత ప్రాజెక్టులు, ప్రజల ప్రాణాలకు పాక్ ముప్పు తెచ్చింది. అంతేకాదు, గత రెండేళ్లుగా ఎన్నో ప్రాజెక్టుల్లో మార్పులు చేసేందుకు పాకిస్తాన్ అనుమతులు కోరుతూనే వచ్చాం. కానీ పాకిస్తాన్ వాటిని తిరస్కరిస్తూ వచ్చింది. ఇలా పాక్ అడ్డుకోవడం వల్ల సింధూ జలాల్లో మా వాటా నీటిని కూడా సరిగా వాడుకోలేకపోతున్నాం. ఇన్ని జరిగిన తర్వాత చివరకు ఉగ్రవాదుల కేంద్రబిందువైన పాకిస్తాన్‌పై భారత్ చర్యలకు దిగింది. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకునే వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని ఇంతకాలం ఉల్లంఘించింది పాకిస్తానే’ అని హరీష్ స్పష్టం చేశారు.

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నదులపై పలు ప్రాజెక్టులు నిర్మించేందుకు భారత్ సిద్ధం అవుతోంది. ఈ ఒప్పందం నిలిపివేసినప్పటి నుంచి భారత్‌ను పాకిస్తాన్ బెదిరిస్తూనే ఉంది. ఆరంభంలో లష్కర్ ఉగ్రవాది హఫీజ్ సయీద్.. ‘నీటిని ఆపితే భారత్ ఊపిరి ఆపేస్తాం’ అంటూ హెచ్చరించారు. తాజాగా ఆ దేశ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కూడా ఇవే మాటలతో భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే భారత్ మాత్రం ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోవడం లేదు.

Next Story