ఆకస్మిక వరదలు.. 18మంది గల్లంతు, నలుగురు మృతి

by Naga Rani Yarlagadda |

పాకిస్తాన్ ఖైబర్ పక్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు.

ఆకస్మిక వరదలు.. 18మంది గల్లంతు, నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ ఖైబర్ పక్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు.

మృతులు పర్యాటకుల బృందంలో భాగంగా స్వాత్ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన కుటుంబానికి చెందినవారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నది మట్టం అకస్మాత్తుగా పెరగడంతో వారు నీటిలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం 80 మందితో కూడిన రెస్క్యూ బృందం ఐదు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతోంది.

ఇదే సమయంలో.. ఖ్వాజఖేలా వద్ద స్వాత్ నదిలో నీటి ఉద్ధృతి 77,782 క్యూసెక్కులకు చేరడంతో ‘అతి భారీ వరద’గా గుర్తించామని ఖైబర్ పక్తూన్‌ఖ్వా విపత్తు నిర్వహణ సంస్థ (PDMA) పేర్కొంది. రాష్ట్రంలోని పేషావర్, చర్సద్దా, నౌషెరా జిల్లాల కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ఆస్తి, పంటలు, పశువులను కాపాడేందుకు అత్యవసర జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను పీడీఎంఏ ఆదేశించింది. అధిక ప్రమాదమున్న ప్రాంతాలను గుర్తించి, అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది.

Next Story