ఘోర విషాదం.. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి

by Malleboina Mahesh |

పంజాబ్ రాష్ట్రంలో అత్యంత ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి 14 మృతి చెందగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది

ఘోర విషాదం.. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో అత్యంత ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం (Adulterated liquor) సేవించి 14 మంది మృతి (14 people died) చెందగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన సోమవారం రాత్రి అమృత్‌సర్‌‌ (Amritsar) జిల్లాలోని మజిఠా ప్రాంతంలో చోటు చేసుకుందని ఎస్‌ఎస్‌పి మనీందర్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. "నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఇక్కడ కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని మాకు సమాచారం అందింది. మేము వెంటనే చర్యలు తీసుకుని నలుగురిని అరెస్టు చేసాము. కల్తీ మద్యం ప్రధాన సరఫరాదారు పరబ్జీత్ సింగ్‌ను అరెస్టు చేసాము. మేము అతనిని విచారించగా, కింగ్‌పిన్ సరఫరాదారు సహబ్ సింగ్ గురించి తెలుసుకున్నాము.

మేము అతనిని కూడా చుట్టుముట్టాము. అతను ఏయే సంస్థల నుంచి ఈ మద్యం కొనుగోలు చేశాడనే దానిపై మేము దర్యాప్తు చేస్తున్నాము. కల్తీ మద్యం (Adulterated liquor) సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం నుండి మాకు కఠినమైన ఆదేశాలు అందాయి. త్వరలో కల్తీ మద్యం అమ్మకం దారులపై దాడులు జరుగుతాయని తెలిపారు. అలాగే తాజా ఘటనపై 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. ఈ ఘటనతో మరిన్ని ప్రాణనష్టాన్ని నివారించడానికి కల్తీ మద్యం సేవించిన వ్యక్తులను కనుగొనడానికి ఇంటింటికీ వెళ్తున్నామని, ప్రస్తుతం ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని ఎస్‌ఎస్‌పి మనీందర్ సింగ్ తెలిపారు.

ఈ ఘటన సమాచారం అందుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (CM Bhagwant Mann) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఆయన దోషులను కఠినంగా శిక్షిస్తామని, ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఉచిత వైద్య సహాయం అందిస్తుందని సీఎం మాన్ ప్రకటించారు.

Next Story