Texas Floods: వరదల్లో 82కు పెరిగిన మృతుల సంఖ్య

by S Gopi |   (  Updated:2025-07-07 17:20:05  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్నీ ' 100 ఏళ్లలోనే అతిపెద్ద విపత్తు' అని అన్నారు.

Texas Floods: వరదల్లో 82కు పెరిగిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని టెక్సాస్‌లో వరదలు అందరి జీవితాలను అతలాకుతలం చేశాయి. ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించడంతో 82 మంది మరణించారు. మరెంతోమంది గల్లంతయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్నీ ' 100 ఏళ్లలోనే అతిపెద్ద విపత్తు' అని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం(జూలై 11) సందర్శిస్తానని చెప్పారు. టెక్సాస్‌లోని కేర్ కౌంటీ, టెక్సాస్ హిల్ కంట్రీ‌లలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలు వరదల్లో కొట్టుకుపోవడం వల్ల, ఆయా ప్రాంతాల్లో 68 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో 28 మంది పిల్లలే ఉండటం విషాదకరమని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే ట్రావిస్, బుర్నెట్, కెండాల్, టోమ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలలోనూ 10 మంది వరకు చనిపోయినట్టు సమాచారం.

టెక్సాస్ హిల్ కంట్రీ నది వద్ద ఏర్పాటు చేసిన వేసవి శిబిరానికి వచ్చిన 10 మంది బాలికలు, ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు ప్రకటించారు. వారి క్యాబిన్లు వరదల్లో కొట్టుకుపో యింది. వారందరి కోసం నిరంతరాయంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. వరదల వల్ల సెంట్రల్ టెక్సాస్ ప్రాంతం సమస్యాత్మకంగా మారింది. అందువల్లే సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు.

విపత్తుకు సంబంధించి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక ప్రకటన విడుదల చేశారు. వరదల్లో 41 మంది గల్లంతయ్యారని, ఈ సంఖ్య మరింత పెరగొచ్చని చెప్పారు. మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, వాటి వల్ల మరోసారి వరద తీవ్రత పెరగొచ్చని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదకర వరదల గురించి కేర్ కౌంటీలోని ప్రజలకు అత్యవసర మెసేజ్ లు పంపించారు. కాగా, ఇప్పటివరకు టెక్సాస్‌ వరదల్లో చిక్కుకున్న 850 మందిని రక్షించినట్టు అధికారులు పేర్కొన్నారు.

Next Story