బ్యాక్​ టు భాగ్యనగర్​

104

దిశ ప్రతినిధి, నల్లగొండ : వారం రోజుల పాటు పల్లె తల్లి సంబురాల్లో మునిగితేలింది. సంక్రాంతి పండుగ కోసం పట్నం వాసులు పల్లెలకు చేరి హాయిగా ఊపిరి పీల్చుకోగలిగారు. పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన నగరవాసులంతా తిరిగి పట్నానికి పరుగులు తీస్తున్నారు. వారం రోజుల పాటు పల్లెల్లో బిజీ లైఫ్‌కు దూరంగా గడిపిన నగరవాసులు తిరిగి వర్క్ మోడ్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సెలవులు ముగిసి సోమవారం నుంచి కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఉదయం నుంచే వాహనాలు ఆడపాదడపా హైదరాబాద్ బాట పట్టినా సాయంత్రానికి విపరీతమైన తాకిడి పెరిగింది.

టోల్ ప్లాజాల వద్ద బారులు..

సంక్రాంతి పండుగ ముగియడంతో ఏపీకి వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ తిరుగు పయనం కావడంతో టోల్ ప్లాజాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులుదీరాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 12 ఎంట్రీ గేట్లు ఉండగా, అందులో ఏడు ఎంట్రీ గేట్లను హైదరాబాద్ వెళ్లేందుకు కేటాయించినా, దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 14 ఎంట్రీలు ఉండగా, 9 ఎంట్రీలను హైదరాబాద్ వైపునకు వెళ్లేందుకు కేటాయించినా కిలోమీటరున్నర మేర వాహనాలు నిలిచిపోయాయి. మాడ్గులపల్లి టోల్ ప్లాజా వద్ద 10 ఎంట్రీలు ఉంటే 6 హైదరాబాద్ వైపు వెళ్లేందుకు కేటాయించారు. గూడూరు టోల్ ప్లాజా వద్ద దాదాపు అరకిలోమీటరు మేర వాహనాలు నిలిచాయి.

హైవేపై పట్టణాల్లోనూ ట్రాఫిక్ జామ్..

ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే ఉమ్మడి నల్లగొండ జిల్లానే ప్రధాన మార్గం. అందులోనూ విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి కీలకం. అత్యధిక శాతం వాహనాలు ఈ రహదారి మీదుగానే హైదరాబాద్‌కు చేరుకుంటాయి. ఈ క్రమంలోనే జాతీయ రహదారి మీద ఉన్న కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్ పట్టణాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోదాడ పట్టణం మొదలుకుని రామోజీ ఫిల్మ్ సిటీ వరకు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వాహనాలతో పాటు అంబులెన్సులను యంత్రాంగం సిద్ధం చేసింది. మూడు జిల్లాలకు చెందిన పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

80 శాతం చెల్లింపులు ఫాస్టాగ్..

టోల్​ప్లాజాల వద్ద అధిక (దాదాపు 80) శాతం చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరిగినట్టు టోల్ ప్లాజా అధికారులు చెబుతున్నారు. గతంలో ఒక్కో టోల్ ప్లాజాను దాటాలంటే గంట నుంచి రెండు గంటలకు పైగా వేచి చూడాల్సి వచ్చేది. ఈసారి అధిక శాతం చెల్లింపులు ఫాస్టాగ్‌తో చేయడం వల్ల ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డారనే చెప్పాలి. అయితే మిగిలిన 20 శాతం మంది వాహనదారులు ఇంకా మ్యానువల్ పద్ధతిలో టోల్ చెల్లింపులు చేస్తుండడం వల్ల పూర్తిస్థాయిలో ట్రాఫిక్ సమస్య క్లియర్ కావడం లేదు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..