చీత్కారాలకు గురవుతోన్న నేతన్న.. మగ్గానికి భరోసా ఏది?

by  |
చీత్కారాలకు గురవుతోన్న నేతన్న.. మగ్గానికి భరోసా ఏది?
X

దిశ, పబ్లిక్ పల్స్ : చేనేత రంగాన్ని 2018 ఏప్రిల్​17 గందరగోళానికి గురి చేసింది. టెస్కో (తెలంగాణ స్టేట్​హ్యాండ్లూం వీవర్స్​ కోఆపరేటివ్ ​సొసైటీ లిమిటెడ్) మనుగడలోనే ఉండగానే, కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎలాంటి ప్రయోజనాలు ఆశించారో ఎవరికీ అంతుచిక్కలేదు. కనీసం చేనేత వర్గాలతో సంప్రదింపులు కూడా జరుపలేదు. కేవలం చేనేత, జౌళి శాఖ సంచాలకుల సిఫారసు మేరకు జీఓ నం.28 ద్వారా తెలంగాణ పవర్​లూం అండ్​టెక్స్ టైల్​ డెవలప్మెంట్​ కార్పొరేషన్ లిమిటెడ్, జీఓ నం.29 ద్వారా తెలంగాణ హ్యాండ్లూం డెవలప్మెంట్ ​కార్పొరేషన్ ​లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో ఫస్ట్ ​డైరెక్టర్లుగా ఐఏఎస్ ​అధికారి శైలజా రామయ్యర్, డిప్యూటీ సెక్రెటరీ పి.కిరణ్‌కుమార్, ఆర్ధిక శాఖ నుంచి ఓ ప్రతినిధి ఉంటారు. కార్పొరేషన్​ షేర్ క్యాపిటల్ ​రూ.5.10 కోట్లుగా నిర్ణయించారు. జవసత్వాలు కల్పిస్తే బలోపేతమయ్యే టెస్కోను పట్టించుకోలేదు. ఎంతో మేధోసంపత్తి కలిగిన ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. స్థిర, చరాస్తులు ఉన్నాయి. పలు పట్టణాలలో స్థలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పొత్తు తెంచుకోలేదు. టెస్కో పునరుజ్జీవ పథకాలను, పరిశోధనల గురించి ఆలోచించని ఉన్నతాధికారుల అధ్యయనం కార్పొరేషన్ల దిశగా అడుగులు వేయించింది.

మూడేండ్లు దాలుతున్నా ఆ వైపున ఒక్క అడుగూ పడలేదు. ఆ రెండు జీఓలు కాలగర్భంలో కలిశాయి. టీఆర్ఎస్ ​పార్టీలో చేనేత వర్గాలకు ప్రతినిధులమని చెప్పుకునే గొప్ప నాయకులు గానీ, ఇటీవల గులాబీ తీర్ధం పుచ్చుకున్న ఎల్. రమణ వంటి వారుగానీ ప్రస్తావించలేదు. టెస్కోను ఏం చేస్తారో, ఏం చేయనున్నారో అడగలేదు. దశాబ్దాలుగా చేనేత కార్మికులకు భరోసానిచ్చిన సొసైటీల గమ్యం ఎటో ఎవరూ నిర్వచించలేదు. పాలక మండళ్ల ఊసే లేకుండా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన పాలక మండళ్లను పక్కన పెట్టి రెండేండ్ల కాలం అధికారులే ఏకచ్ఛత్రాధిపత్యం వహించారన్న ఆగ్రహం కార్మికులలో ఉంది. పదవీకాలం ఉండగానే అధికారాలకు కోత పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఆప్కోకు ధీటుగా టెస్కోను నడిపించలేకపోతున్నారు. సహకార వ్యవస్థ ద్వారా చేనేత కార్మికుల జీవనశైలిని మార్చేసిన ఘనత ఆచార్య కొండా లక్ష్మణ్​బాపూజీది. అందుకే దశాబ్దాల కాలంపాటు హైకో పేరిట మొదలైన సర్వీసులు టెస్కో దాకా చేరాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి స్కూల్​ విద్యార్ధులకు డ్రెస్​ మెటీరియల్​ఆర్డర్‌తో మొదలైన నిర్వీర్యత కార్పొరేషన్ దాకా చేరింది. ఈ ఏడేండ్ల కాలంలో ఒక్కసారి కూడా సహకార సంఘాలకు ఎన్నికలు జరుగలేదు. డైరెక్టర్ల పదవీ కాలంపైనా రెండేండ్లు సందిగ్ధతావస్థనే మిగిల్చారు. ప్రజాప్రతినిధుల మాటకూ అధికారులు, ఉద్యోగుల దగ్గర విలువ లేకుండాపోయింది. టెస్కోకు చైర్మన్‌గా పని చేసే అవకాశం లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో యథాతథ స్థితిని అనుసరించడం గమనార్హం. జియో ట్యాగింగ్, త్రిఫ్టు ఫండ్ వంటి అమలు ఏ పాటిదో ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఏటా చేనేత రంగానికి కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన వ్యయంలో అంతులేని వ్యత్యాసం ఉన్నది. ఆచరణలో చిత్తశుద్ధిని లేదు.

ఆర్డర్ల రద్దు వెనుక..

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రోత్పత్తి ఆప్కో ద్వారానే జరిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొందరు ఉద్యోగులు ఆర్డర్ల కోసం అధికారుల దగ్గరికి వెళ్లినప్పుడు చీత్కారాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. చేనేత ధరలు ఎక్కువ. ఎక్కడ తక్కువ ధరకు దొరకుతాయో అక్కడి నుంచి తెప్పించుకుంటామంటూ బదులిచ్చిన సందర్భాలు కనిపించాయి. బతుకమ్మ చీరలు సిరిసిల్ల మగ్గాలను బతికిస్తున్నాయి. మిగతా ప్రాంతాలలో పవర్‌లూం వ్యాపారం దివాళా తీసింది. కరోనా వ్యాప్తి తర్వాత ఉత్పత్తి సగానికి పైగానే తగ్గించేశారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయి. కార్మికులు దుస్థితిలో ఉన్నారు. వేలాది కుటుంబాలు కుల వృత్తిని శాశ్వతంగా వదిలేశాయి. నేయగల ఓర్పు, నేర్పు ఉంది. శక్తి ఉంది. మార్కెటింగ్​ను సాధించలేకపోవడమే కార్మికుల ఫెయిల్యూర్. ఆ ఒక్క దన్ను కోసం ప్రభుత్వ పెద్దల వైపు చూస్తున్నారు. మార్కెటింగ్​ వైపు నాలుగు అడుగులు వేయిస్తే తెలంగాణ చేనేత రంగం నలుదిక్కులా మార్మోగేది. అవగాహన లేని కొందరు మంత్రులతో బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా చేనేత వర్గాల సరసన చేర్చి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన పాలకులకు, అధికారులకు చేనేత రంగం, కార్మికులు గుర్తుకొస్తున్నారు. అక్కడక్కడ అవార్డులు అందజేసి మగ్గం బతికే ఉన్నదని సమాజానికి చాటి చెబుతున్నారు. చచ్చాక వచ్చే బీమా పథకం మాకెందుకు? బతికి ఉండగానే భరోసా ఇచ్చే ‘చేనేత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టాలని చేనేత కుటుంబాలు కోరుతున్నాయి. శిరందాస్​ ప్రవీణ్​కుమార్, 8096677450

చేనేత కాంతి విద్యాజ్యోతి

చేనేత మగ్గం మీద మగ్గి పోయి, ప్రతిభ ఉన్నా ఉన్నత విద్యకు నోచుకోలేని మెరికలకు చేయూతనిచ్చి ఆదుకొవడమే టి-పోపా ‘విద్యాజ్యోతి’ ముఖ్య ఉద్దేశ్యం. దీనిని 2015లో స్థాపించారు. అవసరార్థులకు చేతనైనంత సాయం చేస్తున్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం సైతం సేవా యజ్ఞం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి అని దీవించింది. 2020 మార్చి నుంచి కరోనా మూలంగా ఎన్నో చేనేత కుటుంబాలకు పని లేక, తయారు చేసిన వస్త్రాలకు ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నిరాశలో పడిపోయారు. అలాంటి వారికి తగిన ఆర్థిక సాయం అందజేయడమేగాక రేషన్ కూడా ఇచ్చి అండగా నిలిచారు. టి-పోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల సహదేవ్ ఇందుకోసం కృషి చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా దీనిని నిర్వహిస్తున్నారు. చేనేత యువత ఆర్థిక లేమితో చదువును అర్ధంతరంగా ముగించకుండా విద్యాజ్యోతి అండగా నిలుస్తున్నది. టి-పోపా అధ్యక్షుడిగా గండూరి వెంకటేశ్వర్లు, సహాధ్యక్షులుగా సిరందాస్ శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శిగా మాచన రఘునందన్ సేవలందిస్తున్నారు. మగ్గం మీద సత్తా చూపే విద్యార్థుల నుంచి పక్కా ప్రణాళికతో, గవర్నింగ్ బాడీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఆకాశమే హద్దుగా యువత ప్రతిభ చాటుకునే పుష్కల అవకాశాలు ఉన్నాయి. సరైన మార్గ నిర్దేశం లేక ఎంతోమంది చేనేత కుటుంబాలకు చెందిన యువత హైస్కూల్, ఇంటర్ వరకే చదువుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. సంసద్ రత్న, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ చేతుల మీదుగా నారాయణగూడ రాజ్‌మొహల్లా పద్మశాలి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులకు చెక్కులను అందజేసి ఈ సేవా యజ్ఞాన్ని ప్రారంభించారు.

మాచన రఘునందన్
రాష్ట్ర ప్రచార కార్యదర్శి
తెలంగాణ పోపా
9441252121



Next Story

Most Viewed