కోట్లు విలువ చేసే టాయ్‌లెట్‌ను పంపిస్తున్న ‘నాసా’

by  |
కోట్లు విలువ చేసే టాయ్‌లెట్‌ను పంపిస్తున్న ‘నాసా’
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో పనిచేస్తున్న వ్యోమగాముల కోసం 23 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 170 కోట్ల ఖర్చుతో తయారుచేసిన టాయ్‌లెట్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా, సెప్టెంబర్ 29న పంపించబోతోంది. వర్జీనియాలో ఉన్న వాలోప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ నుంచి నార్త్‌రోప్ గ్రూమన్ కాంట్రాక్ట్ రీసప్లయ్ మిషన్ ద్వారా పంపిస్తున్న వేరే కార్గోతో పాటు ఈ టాయ్‌లెట్‌ను నాసా పంపించబోతోంది. నాసా పంపిస్తున్న ఈ కొత్త స్పేస్ టాయ్‌లెట్‌కు ‘యూనివర్సల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ అని పేరు పెట్టారు. త్వరలో అంగారకుడు, చంద్రుని మీద ఆవాసాలు ఏర్పరచుకున్నపుడు కూడా ఇలాంటి టాయ్‌లెట్‌లు ఉపయోగించబోతున్నట్లు నాసా తెలిపింది. ఇంతకీ ఈ టాయ్‌లెట్ ప్రత్యేకతలేంటో తెలుసా?

ప్రస్తుతం ఐఎస్ఎస్‌లో ఉపయోగిస్తున్న టాయ్‌లెట్ కంటే ఈ టాయ్‌లెట్ 65 శాతం చిన్నది, 40 శాతం తేలికైనది. వ్యోమగాములు ఎప్పుడూ పనిచేస్తూనే ఉండే స్పేస్ స్టేషన్లలో వారి విసర్జితాలను ప్రీ-ట్రీట్ చేయగల రీజనరేటివ్ సిస్టమ్ ఈ టాయ్‌లెట్‌లో ఉంది. ఉపయోగించిన నీటిని కూడా ఇది రీసైకిల్ చేస్తుంది. అయితే షార్ట్ టర్మ్ మిషన్లలో దీన్ని ఉపయోగించినపుడు ఎలాంటి ప్రీ-ట్రీట్‌మెంట్ లేకుండా విసర్జకాలను ఇది భద్రపరుస్తుంది. ఈ టాయ్‌లెట్ ప్రీ-ట్రీట్ చేసిన విసర్జకాలను వ్యోమగాములు తాగడానికి కూడా వినియోగించుకోవచ్చు. స్పేస్ స్టేషన్‌లో ఉన్న ద్రవాలను 90 శాతం రీసైకిల్ చేసి వినియోగించడానికి ప్రయత్నిస్తామని నాసా వ్యోమగామి జెస్సికా మెయిర్ తెలిపారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి వదిలిన విసర్జకాలను లాక్కోగలగాలి. అలాంటి కృత్రిమ గురుత్వాకర్షణ ఈ టాయ్‌లెట్‌లో ఉంది. అలాగే ఇందులో ఉన్న గాలి ప్రసరణ నియంత్రణ విధానం ద్వారా వాసన రాకుండా కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా దీన్ని శుభ్రం చేయడం సులభం, సమయం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇన్ని టెక్నాలజీలు ఉన్నాయి కాబట్టి దీనికి ఇంత ఖర్చు.


Next Story

Most Viewed