చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్

by  |
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్
X

బిలియనీర్ పారిశ్రామికవేత్త ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్‌ఎక్స్’ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి ప్రైవేటు కంపెనీగా నిలిచింది. తమ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా స్పేస్‌ఎక్స్ ఇద్దరు అమెరికన్ వ్యోమగాములను శనివారం అంతరిక్షానికి పంపింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి రెండుదశల ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ‘రాబర్ట్ బెంకెన్, డగ్లస్ హర్లే’ అనే అమెరికన్ వ్యోమగాములు అంతరిక్షానికి ప్రయాణించారు.

19 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం (అమెరికా కాలమానం ప్రకారం) స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. 2011లో అమెరికాలో స్పేస్ షటిల్ కార్యక్రమాలను నాసా నిలిపివేసిన తర్వాత అక్కడి నుంచి అమెరికన్ వ్యోమగాములను పంపడం ఇదే తొలిసారి. ఇది నిజంగా ఒక సంతోషకరమైన సందర్భమని ఇలాన్ మస్క్ వర్ణించారు. మే 27న వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆగిపోయిన ఈ ప్రయాణం.. ఎట్టకేలకు పూర్తయినందుకు సంతోషంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

వ్యోమగాములు వీరే!

డెమో-2కు స్పేస్‌క్రాఫ్ట్ కమాండర్‌గా ఉన్న డగ్లస్ హర్లీ గతంలో యూఎస్ మెరైన్ కార్ప్స్‌లో ఫైటర్ పైలెట్‌గా ఉన్నారు. 2000లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి రెండు సార్లు 2009, 2011లలో అంతరిక్షయాత్రను పూర్తి చేసుకున్నారు. న్యూయార్క్‌కు చెందిన డగ్లస్.. క్రూ డ్రాగన్‌లో లాంచ్, ల్యాండింగ్, రికవరీ పనులను పర్యవేక్షిస్తారు.

ఇక 49 ఏళ్ల బెంకెన్.. గతంలో ఎయిర్ ఫోర్స్ పైలెట్‌గా పనిచేశారు. 2000 జులైలో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి 2008, 2010లో స్పేస్ షటిల్ ఫ్లైట్స్ పూర్తి చేసుకున్నారు. క్రూ డ్రాగన్‌లో ఈయన ఐఎస్ఎస్ ల్యాండింగ్, డాకింగ్, అన్‌డాకింగ్ పనులను పర్యవేక్షిస్తారు.


Next Story

Most Viewed