చర్చల విఫలం వెనుక కొన్ని శక్తుల కుట్ర: తోమర్

52

న్యూఢిల్లీ: ఢిల్లీ బార్డర్‌లో ఆందోళనలు చేస్తున్న రైతులు కొత్త సాగు చట్టాల ద్వారా లభిస్తున్న ప్రయోజనాలను విశ్లేషించడం లేదని, వారు కేవలం చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ దగ్గరే ఆగిపోతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. అందుకే చర్చలు ముందుకు సాగలేవని భావిస్తున్నట్టు తెలిపారు. ‘ఈ చర్చలు సఫలం కాకపోవడం వెనుక కొన్ని శక్తులున్నాయి. అవి ఆందోళనలు ఇలాగే కొనసాగాలని భావిస్తున్నాయి. నాకు అవి కనిపించలేదు. కానీ, ఆందోళనలు ముగిసిపోకుండా, చర్చలు విఫలం కావడానికి అవి ప్రయత్నించినట్టు భావిస్తున్నాను’ అని ఆయన ఆరోపించారు.

కేంద్రానిది రైతుల పక్షమేనని, రైతు సంఘాలను గౌరవిస్తుందని తెలిపారు. రైతు నేతలు లేవనెత్తిన అంశాలను అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి ప్రయత్నించామని, అందుకే అనేక ప్రతిపాదనలు వారి ముందుంచామని చెప్పారు. వారి ప్రతిపాదనలనూ ఆహ్వానించామని, కానీ, వారు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టకపోగా తమ ప్రతిపాదనలను తిరస్కరించారని వివరించారు. సాగు చట్టాల అమలు నిలుపుదల ప్రతిపాదనను వారు తిరస్కరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..