40 వేల ఎకరాల పంటను కాపాడిన నల్లగొండ పోలీసులు

by  |
Fake seeds2
X

దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా పోలీసులు తెలంగాణలోని 40 వేల ఎకరాల పంటలను కాపాడారు. వ్యవసాయ సీజన్ లో రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి వేలాది మంది రైతులను నష్టాల ఊబి నుంచి బయటపడేశారు. రూ.6కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో డీఐజీ ఏవీ. రంగనాథ్‌తో కలిసి వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలను అసలైనవిగా విక్రయిస్తున్నారని దేవరకొండ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బృందాలు 15 రోజులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిఘా వేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 13 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన 20 టన్నుల పత్తి, రూ.2 కోట్ల విలువైన 200 టన్నుల వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ విత్తనాల దందాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వ్యాపారులు ఉన్నారు. ఈ విత్తనాలతో సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయవచ్చని వారు వెల్లడించారు. నల్లగొండ పోలీసుల చాకచక్యంతో రైతుల నష్టాలను నివారించామని పేర్కొన్నారు.

Fake seeds

ప్రధాన నిందితులు వీళ్లే..

నంద్యాలకు చెందిన కర్నాటి మధుసూదన్ రెడ్డి గతంలో ఇదే కేసులో తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో అరెస్టయ్యాడు. అతడిపై నల్లగొండ పోలీసుల పీడీ యాక్ట్ నమోదు చేసిన వరంగల్ జైలుకు తరలించారు. బయటకు వచ్చిన తర్వాత ఖమ్మంకు చెందిన పెద్దిరెడ్డి, నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన బాలస్వామి, దేవరకొండకు చెందిన పిచ్చయ్య, హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి, పవన్ లతో పాటు మరికొంత మందిని కలిసి పెద్ద ఎత్తున ఈ సీజన్ లో నకిలీ విత్తనాల దందాకు స్కెచ్ వేశారు. ఈ సమాచారం నల్లగొండ పోలీసులకు అందడంతో సీఐలు బాలగోపాల్, ఎస్.ఎం. బాషా, చండూర్ సీఐ సురేష్ కుమార్, నల్లగొండ రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలు ఏర్పడ్డారు. శాలిగౌరరం సీఐ పి.ఎన్.డి. ప్రసాద్, తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణ, చిట్యాల ఎస్ఐ నాగరాజు, ఎస్ఐ నాగుల్ మీరా, ఇతర పోలీసుల సహకారంతో నకిలీ విత్తనాల దందా మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసినట్లు వారు తెలిపారు.

ఎక్కడెక్కడ ఏం పట్టుపడ్డాయంటే..

పోలీసులు తెలుగు రాష్ట్రాల్లోని గజ్వేల్, నంద్యాల, ఆళ్లగడ్డ, గద్వాల, జడ్చర్ల, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలోని గుండ్ల పోచంపల్లి, యల్లంపేట, దేవర యంజాల్, బోయినపల్లి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆయా ప్రాంతల్లో 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, 140 టన్నుల వరి విత్తనాలు, 40 టన్నుల మొక్కజొన్న విత్తనాలు, నాలుగు క్వింటాళ్ల నకిలీ కూరగాయల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నైరుతి సీడ్స్ పేరుతో దందాకు శ్రీకారం..

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు, చార్టెడ్ అకౌంటెంట్ ఏనుబోతుల శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో నైరుతి సీడ్స్ పేరుతో కంపెనీ స్థాపించి నకిలీ విత్తనాల దందాకు తెరలేపాడు. నాలుగేళ్లుగా రైతుల నుండి వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను తక్కువ ధరకు సేకరించి ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సీడ్స్ ప్యాకింగ్ కవర్లు, క్యూఆర్ కోడ్, ఇతర లేబుల్స్ ముద్రించి ప్రాసెసింగ్ యూనిట్లలో వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి విక్రయించేవాడని తెలిపారు. గడువు ముగిసిన ప్యాకెట్లను టిన్నర్ వినియోగించి గడువు తేదీలను చెరిపేసి కొత్త తేదీలను ముద్రించి నకిలీ విత్తనాలను విక్రయించేవాడని చెప్పారు.

Fake seeds3

ఆయనకు కాకినాడకు చెందిన మెడిశెట్టి గోవిందు భాగస్వామిగా వ్యవహరిస్తూ దేవరయంజాల్‌లోని యంజీ అగ్రిటెక్ ప్రాసెసింగ్ యూనిట్‌లో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలు చేశారు. వారిద్దరు నంద్యాలకు చెందిన గోరుకంటి పవన్ కుమార్, మధుసూదన్ రెడ్డి, స్వామిదాస్ ల వద్ద నుండి రిజెక్టేడ్ సీడ్స్, గడువు తీరిన విత్తనాలు, జిన్నింగ్ మిల్లుల నుండి పత్తి గింజలను తీసుకొని వచ్చి ప్రాసెసింగ్ చేసి ఈ దందాకు పాల్పడ్డారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితురాలు, ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి భార్య, నైరుతి సీడ్స్ భాగస్వామి ఏనుబోతుల రజిత భర్త శ్రీనివాస్ రెడ్డి నకిలీ విత్తనాల దందాకు చేదోడుగా నిలుస్తూ అతని అనుచరులను సమన్వయం చేస్తుండేదన్నారు. ఈ మొత్తం కేసులో సమర్ధవంతంగా పనిచేసిన పోలీస్ అధికారులందరికి డీజీపీ మహేందర్ రెడ్డి రివార్డులు, పతకాలు ప్రకటించినట్లు ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

ఇప్పటి వరకు 141 కేసులు

నకిలీ పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయల విత్తనాలు వెస్ట్ జోన్ పరిధిలో 13 జిల్లాలో 141 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 21 కోట్ల 12 లక్షల 96 వేల రూపాయల విలువైన విత్తనాలను సీజ్ చేశామని వివరించారు. నల్లగొండలో సీజ్ చేసిన ఆరు కోట్ల రూపాయల నకిలీ విత్తనాలతో కలిపి మొత్తం 27 కోట్ల 12 లక్షల 96 వేల రూపాయల విలువైన విత్తనాలను సీజ్ చేసినట్లు ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, శివశంకర్ రెడ్డి వెల్లడించారు.


Next Story

Most Viewed