నాగశౌర్య ‘వరుడి’గా వస్తాడా?

by  |
నాగశౌర్య ‘వరుడి’గా వస్తాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: కుర్ర హీరోల్లో నాగశౌర్య రూట్.. సెపరేట్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చే ఈ యంగ్ హీరో.. సౌజన్య అనే కొత్త డైరెక్టర్‌తో చేస్తున్న సినిమా కూడా కుటుంబ నేపథ్యంలోనే సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుండగా.. పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ ఇందులో కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టినట్లు సమాచారం.

లాక్‌డౌన్ టైమ్‌లో యంగ్ బ్యాచిలర్ హీరోలు కొందరు సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కేశారు. మరి నాగశౌర్య.. రియల్ లైఫ్‌లో ఏడడుగుల బంధానికి ఎప్పుడు ఓకే చెప్తాడో తెలియదు కానీ.. రీల్ లైఫ్‌లో మాత్రం పెళ్లి పీటలెక్కేశాడు. తన లేటెస్ట్ సినిమాకు ‘వరుడు కావలెను’ అనే సినిమా టైటిల్ పెట్టినట్లు ఫిల్మ్ నగర్ టాక్. కాగా ఈ యంగ్ బ్యాచిలర్ మరోసారి వరుడి పాత్రలో కనిపించనున్నాడా? అంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది.

ఇక నాగశౌర్య.. ఈ సినిమాతో పాటు సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో ‘ప్రాచీన విలువిద్య’ నేపథ్యంలో చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో పాటు ‘అలా ఎలా’ సినిమా దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నాడు. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనరే కావడం విశేషం. దీన్ని ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


Next Story