సంచలనాలు బయట పెట్టిన ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్

by  |
సంచలనాలు బయట పెట్టిన ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్
X

దిశ, క్రైమ్ బ్యూరో : కరుడుగట్టిన నేరస్తుడు నయీం కేసుపై సమగ్రమైన విచారణ జరపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ డిమాండ్ చేసింది. రాష్ట్ర గవర్నెర్స్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ 2016 ఆగస్టు 8న నయీం ఎన్‌కౌంటర్‌లో మరణించి నాలుగేళ్లు గడిచినా కేసు విచారణను సమగ్రంగా దర్యాప్తు నిర్వహించడంలో సిట్ విఫలమైందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ తర్వాత నయీం ఇంట్లో లభ్యమైన వస్తువుల వివరాలను అందజేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ సిట్ ను కోరగా, సిట్ సోమవారం వివరాలను అందజేసింది. ఈ సందర్భంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ నయీం కేసును సమగ్రంగా దర్యాప్తు చేయడంలో ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) విఫలమైనట్టు విమర్శించారు.

ఒక సామాన్య పౌరుడికి ఆత్మ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ కావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకుని ఉంటుందన్నారు. అలాంటిది నయీంకు 24 తుపాకులకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీటిలో 3 ఏకే-47 తో పాటు ఒక స్టెన్‌గన్ ఉండటం మరింత భయాందోళన కలిగిస్తోందని అన్నారు. సామాన్యులు భూమి కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఆధార్, పాన్ కార్డు, లింకు డాక్యుమెంట్లు, ఫోటోతో సహా వేలిముద్రలు తదితర పత్రాలను సమర్పించాల్సి వస్తోంది. కానీ, అవేమీ లేకుండా నయీంకు 752 రిజిస్ట్రేషన్లు ఎలా సాధ్యం అయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. వేల ఎకరాలకు సంబంధించిన దాదాపు 752 రిజిస్ట్రేషన్ దస్తావేజులు లభ్యం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. నయీం ఇంట్లో 602 సెల్ ఫోన్లు లభ్యం కావడంతో వీటన్నింటీ మంజూరు వ్యవహారంలో కచ్చితంగా నయీంకు పోలీసులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఇతర ప్రభుత్వ అధికారుల, రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనే విషయాన్నిఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed