నా వాసన ఎక్కడో తప్పిపోయింది

by  |
smell
X

కంపో , ఇంపో
ఇట్టే పట్టేసే నా నాసికం
దేహాన్నంతా క్షణంలో చుట్టేసేది వాసన

మొన్న ఎప్పుడో
నా వాసన ఎక్కడో తప్పిపోయింది

కిచెన్ లో పోప్ సుయ్ మన్నా
బెడ్ రూమ్ లో పర్ ఫ్యూమ్ సయ్ సయ్ మన్నా
గుప్పుమన్న వాసన
గుండెలనిండా నాట్యమాడేది

ఇప్పుడు
ఆ వాసన చేసే నాట్యంఎక్కడ?

గుబాలించే వాసన నందుకొని
నా దేహం నిండా పులిమేసి
పులిలా శ్వాస పీర్చుకునే
నా ముక్కుకేం తెలుసు
వాసనలు లేని ఋతువులు కూడా ఉంటాయని,

మనిషే
గమ్యం లేని ప్రయాణం చేస్తున్న సమయం
వాసనను ఎక్కడని వెతకను

షడ్రుచులన్నీ నా నాలుకకి
ఏక రుచిగా తోస్తున్న క్షణం

మా ఆవిడ పెట్టిన టీ తాలూకూ
మాడు వాసనను మాడపగిలేలా తిట్టుకునే నాకు
ఆ మాడు వాసనిప్పుడు
మంచి గంధమై నన్నల్లుకుంటోంది
నువ్వు నాలో లేకపోతేనే తెలిసింది
బతుకెంత చప్పగా ఉందో..

ఇంటి కారిడార్ ను అల్లుకున్న
మల్లె తీగలో మొగ్గ విరిసిందో
మొక్క కన్నా ముందే నా ముక్కుకు తెలిసేది
ఇప్పుడు మల్లెతీగ ఆకాశంలా ఉంది
చుక్కల్లా పువ్వులు మెరుస్తున్నా
ఏ వాసనలు లేవు

వాయువును బిగబట్టి
వాసన అంటే ఎలా?

వాసనొస్తుందంటే
శరీరానికి రుచి పెరుగుతోంది
మనస్సు కి ఆకలవుతోంది

రోజుకి రాత్రీ-పగలున్నట్టే
రుచికైనా , ఆకలికైనా నువ్వుండాలి

రా….
నువ్వు ఇక్కడే ఎక్కడో
రహస్యంగా నాలోనే దాక్కున్నావ్
ప్రపంచమంతా నిద్రలో ఉంది
నాకు చీకటి వాసనేస్తోంది
పొద్దుపొడిచే సరికి నాలోకొచ్చెయ్
గుండె నిండా నిన్ను పీల్చుకోవాలనుంది
ఆయువున్నన్నాళ్లు నువ్వుండాలి
ఇంకోసారి నన్ను విడిచి వెళ్లకు…

Namala Ravindra Suri

నామాల రవీంద్రసూరి
9848321079


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed