ములుగు జ‌డ్పీలో ముస‌లం

by  |
Mulugu ZP Chairman
X

దిశ ములుగు/ వాజేడు : ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ముస‌లం పుట్టింది. మా మ‌ద్దతుతో జ‌డ్పీ చైర్మన్‌గా ప‌ద‌వి ద‌క్కించుకున్న జ‌గ‌దీశ్ మ‌మ్మల్నే ఖాత‌ర్ చేయ‌డం లేదంటూ అధికార పార్టీ జ‌డ్పీటీసీలు అస‌మ్మతి రాగం వినిపిస్తున్నారు. జ‌డ్పీచైర్మన్ ఒంటెద్దు పొక‌డ పోతున్నార‌ని, కొద్దికాలంగా అధికార పార్టీ జ‌డ్పీటీసీలు తీవ్ర అస‌మ్మతితో ర‌గిలిపోతున్నారు.

అభివృద్ధి నిధులు సైతం మండలాలకు కేటాయించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని అస‌మ్మతి జ‌డ్పీటీసీలు చెబుతున్నారు. పార్టీకోసం ప‌నిచేసే వారికి కాకుండా కొత్తగా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి చేరిన వారికి ప్రాధాన్యం క‌ల్పిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవ‌ల జ‌రిగిన జడ్పీ స‌ర్వస‌భ్య స‌మావేశంలో పాల్గొన‌కుండా న‌లుగురు అధికార పార్టీ జ‌డ్పీటీసీలు గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి స‌త్యవ‌తిరాథోడ్‌కు తెలిసేలా నిర‌స‌న వ్యక్తం చేశారు. అదే రోజూ సాయంత్రం జ‌డ్పీచైర్మన్ సొంత నిర్ణయాలు తీసుకుంటూ స‌భ్యుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఒక ప్రక‌ట‌న కూడా చేశారు. ఆ త‌ర్వాత కూడా జ‌డ్పీటీసీల ఆగ్రహావేశాలు చ‌ల్లార‌లేదు.

మంత్రి మాట‌ను ధిక్కరించిన జ‌డ్పీ చైర్మన్‌…

ఏటూరునాగారం మంగపేట మండలాలకు సంబంధించిన ఓ ఇద్దరు ముఖ్యమైన నేతల‌తో జడ్పీ చైర్మన్ కు విభేదాలు నెల‌కొంది. ఇరువర్గాల మధ్య జరిగిన పంచాయితీ కాస్త ఓ మంత్రి దగ్గరికి వెళ్ళినట్లు సమాచారం. ఆ మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ జడ్పీ చైర్మన్ ధిక్కరించినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లాలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనే బాసుగా వ్యవహరిస్తూ.. ఇసుక ర్యాంపులు సైతం తమ అనుమతితో మాత్రమే నిర్వహణ జరగాలని అధికారులకు హుకుం జారీ చేశారు. అధికార పార్టీ ముఖ్య నేతకు సంబంధించిన ఇసుక క్వారీని సైతం రద్దు చేయడంతో అసలు ముసలం మొదలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జ‌డ్పీ చైర్మన్‌కు ఇద్దరి మ‌ద్దతు… న‌లుగురి వ్యతిరేక‌త‌..

ములుగు జిల్లాలో మొత్తం తొమ్మిది మండలాలు ఉండగా మంగ‌పేట మిన‌హా మిగ‌తా 8 మండలాలకు ఎన్నికలు జరిగాయి. ఒకటి కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఏడు టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసుకుంది. మెజార్టీ స‌భ్యుల ఓటింగ్‌తో ఏటూరునాగారం జ‌డ్పీటీసీగా విజ‌యం సాధించిన కుసుమ జ‌గ‌దీశ్ చైర్మన్‌గా ఎన్నిక‌య్యారు. తాడ్వాయి జ‌డ్పీటీసీ, జ‌డ్పీ వైస్ చైర్‌ప‌ర్సన్‌ బడే నాగజ్యోతి, గోవింద‌రావుపేట‌ జ‌డ్పీటీసీ తుమ్మల హరిబాబు , ములుగు జడ్పీటీసీ సకినాల భవాని, మ‌లుగు వెంకటాపుర్‌ జడ్పీటీసీ రుద్రమదేవిలు జ‌డ్పీ చైర్మన్‌పై అస‌మ్మతితో ర‌గిలిపోతున్నారు. వాజేడు, వెంకటాపురం మండలాలకు సంబంధించిన జడ్పీటీసీలు మాత్రమే కుసుమ జగదీష్ వైపు మ‌ద్దతుగా ఉంటూ వ‌స్తున్నారు. మెజార్టీ అధికార పార్టీ స‌భ్యులు అస‌మ్మతి రాగం వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అధికార పార్టీ జ‌డ్పీ స‌భ్యుల మ‌ధ్య నెల‌కొన్న రాజ‌కీయ విబేధాలు మ‌రింత అవ‌కాశం క‌నిపిస్తున్నాయి. భ‌విష్యత్‌లో జ‌డ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి దారి తీస్తాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

Next Story

Most Viewed