టీఆర్ఎస్‌కు మిత్తితో సహా చెల్లిస్తాం.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్

by  |
MP Uttam Kumar Reddy
X

దిశ, డిండి: రాబోయే 2023 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిధిలోని శేశాయికుంట గ్రామంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహావిష్కరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ దొందూ దొందే అని ఎద్దేవా చేశారు. ప్రజలను దోచుకుతినేందుకు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి పేదల నడ్డీ విరుస్తున్నారని మండిపడ్డారు.

నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 12 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవలం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. ఆ దిశగా పార్టీని నడిపించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందని తెలిపారు. గత ఏడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, ప్రశ్నించే కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, గొడవలకు దిగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేసి, గెలుపే లక్ష్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, అఖిలభారత ఆదివాసీ జాతీయ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్, డిండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్లవెల్లి రాజేష్ రెడ్డి, నాయకులు ఏవీ.రెడ్డి, జాల నర్సింహారెడ్డి, బద్దెల శ్రీను, స్వాతి రాజేష్ రెడ్డి, రామ్ సింగ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed