మరో వినూత్న కార్యక్రమానికి ఎంపీ సంతోష్ శ్రీకారం

by  |
మరో వినూత్న కార్యక్రమానికి ఎంపీ సంతోష్ శ్రీకారం
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌తో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన ఆయన తాజాగా మరో ప్రోగ్రాం చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా ‘విత్తన గణపతి’ (సీడ్ గణేశ్)ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆవిష్కరించారు. స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయడం దీని ఉద్దేశ్యం. ప్రతిరోజు పూజలు అందుకునే గణేషునిలోని విత్తనం ఐదు నుంచి ఏడురోజుల్లో మొలకెత్తుతుంది. మరోవారంలో మొక్కగా మారుతుంది. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత ఈ వేప మొక్కను ఆవరణలో నాటుకోవచ్చు. పర్యావరణ మార్పులు, కాలుష్యం, కరోనా లాంటి వైరస్‌లకు పెద్ద ఎత్తున చెట్లు పెంచడమే మార్గమని, ఎంపీ సంతోష్ చేపట్టిన సీడ్ గణేశ్ సక్సెస్ కావాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు.

కేబినెట్ మీటింగ్ సందర్భంగా వచ్చిన మంత్రులకు ఎంపీ సంతోష్ కుమార్ గణేశ్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఇప్పటికే తాము చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గో రూరల్ ఇండియా సంస్థతో కలిసి త్వరలోనే విగ్రహాల పంపిణీ మొదలు పెడతామని ఎంపీ ప్రకటించారు. కరోనా సమయంలో గణపతి వేడుకలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికి వారే తమ ఇళ్లలోనే విత్తన గణపతిని ప్రతిష్ఠించుకునేలా పూజల తర్వాత మొలకెత్తే వేప విత్తనాన్ని నాటుకోవచ్చన్నారు. దీంతో ప్రతి ఇంటి ఆవరణలో ఔషధ గుణాలుండే వేపచెట్టు ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆశయం కూడా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ఆకుపచ్చని తెలంగాణ కోసం ఇది కూడా ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు.

Next Story

Most Viewed