సీఎం జగన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. బాంబ్ పేల్చిన ఎంపీ

by  |
సీఎం జగన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు..  బాంబ్ పేల్చిన ఎంపీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాల్లో హెరాయిన్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వమే హెరాయిన్‌ను సరఫరా చేస్తోందని టీడీపీ ఆరోపిస్తుంటే.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. విమర్శల, ప్రతివిమర్శలతో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ యువతకు హెరాయిన్ సరఫరా చేస్తున్నారంటూ బాంబు పేల్చారు.

రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ ఎవరి కోసం పనిచేస్తోందని నిలదీశారు. టీడీపీని మాట్లాడవద్దని చెప్పడానికి డీజీపీ ఎవరని నిలదీశారు. టీడీపీ గాలి మాటలు మాట్లాడుతుందని డీజీపీ వ్యాఖ్యలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఏ అంశంపైనా టీడీపీ గాలి మాటలు మాట్లాడదని చెప్పుకొచ్చారు. సాక్ష్యాధారాలతోనే మాట్లాడుతుందని ఈ విషయాన్ని డీజీపీ గౌతం సవాంగ్ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. డీజీపీ, ఎస్పీలు, కమిషనర్లు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. హెరాయిన్ అంశంలో వే బిల్లులు బయటకి తీయాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.

సీఎం ఓ పిరికి దద్దమ్మ

సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రద్దుపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కాలు బెణికిందంటూ పర్యటనకు గైర్హాజరవ్వడంపై సెటైర్లు వేశారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బెణకని కాలు ఇప్పుడే బెణికిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని నాడు బెణకకుండా ఇప్పుడు బెణకడం వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. ఢిల్లీ అంటే బెణికిందా..? అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ పిరికిపంద అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎక్కడ నిలదీయాల్సి వస్తోందనే భయంతో సమావేశానికి డుమ్మా కొట్టారన్నారు. కేంద్రాన్ని హోదా అడిగే దమ్ములేక తాడేపల్లి ప్యాలెస్‌లో తల దాచుకుంటున్నారంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.



Next Story

Most Viewed