మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తెస్తున్నాం : వైసీపీ ఎంపీ మోపిదేవి

by  |
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తెస్తున్నాం : వైసీపీ ఎంపీ మోపిదేవి
X

దిశ, ఏపీ బ్యూరో: మత్స్యకారుల జీవితాల్లో ఏపీ ప్రభుత్వం వెలుగులు నింపుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. టీడీపీ-బీజేపీల విధానం మత్స్యకారులకు అనుకూలమా లేక దళారులకు అనుకూలమా అని ప్రశ్నించారు. మత్స్యకారుల నోరు కొట్టి.. దళారులకు దోచిపెట్టాలన్నదే టీడీపీ-బీజేపీ వాదనా..? అని నిలదీశారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ ‘మత్స్యకారులకు రూ. 15 వేలు దక్కేలా చేస్తుంటే ప్రతిపక్షాల గగ్గోలు దేనికోసం..? నాడు బాబు మత్స్యకారుల బట్టలూడ దీస్తానంటే.. మీ నోర్లు ఎందుకు పెగలలేదు..? మత్స్యకారుల సంక్షేమానికి ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా..? వంద హెక్టార్ల చెరువుల నిర్వహణ ఇంతకాలం పేరుకి సొసైటీలు..పెత్తనం దళారులదే’ అని మోపి దేవి ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటూ, వారికి మరింత మేలు చేకూరేలా నిర్ణయాలు చేస్తుంటే.. టీడీపీ-బీజేపీ నేతలు ఉరి అంటూ గోబెల్స్ తరహాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం మత్స్యకార సొసైటీ సభ్యులకు కేవలం వెయ్యి రూపాయలు ఆదాయం మాత్రమే ఉన్న చెరువులకు సంబంధించి.. మత్స్యకారుల ఆదాయం రూ. 15 వేల వరకు పెరిగేలా నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాస్తూ మత్స్యకారుల గొంతుకు ఉరి బిగించేలా ఉందంటూ ఏవేవో పిచ్చి రాతలు రాస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

చంద్రబాబు మత్స్యకారులను అవహేళనగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులు, అంశాలు, డిమాండ్లు సాధించుకోవాడానికి విశాఖలో చంద్రబాబును కలిస్తే ‘ఎక్కువ తక్కువగా మాట్లాడితే బట్టలూడదీస్తాను.. తోకలు కత్తిరిస్తా..’ అంటూ సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని ఎంపీ మోపిదేవి గుర్తు చేశారు. నాడు మత్స్యకార జాతిని అవమానపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడిన మాటలకు అప్పట్లో ఈ సామాజిక వర్గ నేతలకు కనీసం చీమ కుట్టినట్లు లేదని మండిపడ్డారు. బీసీలకు, మత్స్యకారుల సంక్షేమానికి టీడీపీ హయాంలో ఏం చేశారు, ఈ రెండేళ్ళ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనే అంశంపై.. చర్చకు వస్తే వాస్తవాలు వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

Next Story

Most Viewed