కరోనాపై తండ్రీ, కొడుకుల డ్రామాలు: ఎంపీ కోమటిరెడ్డి

by  |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువవుతుందని, అయినా సీఎం కేసీఆర్ మానవత్వం లేకుండా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని, జనం పిట్టల్లా రాలుతుంటే కంటికి కనిపించనట్టుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా టాస్క్​ఫోర్స్​ కమిటీ చైర్మన్‌గా కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించారని, ఆయన్ను కూడా ఇదే అంశంపై నిలదీస్తున్నారని, ఇప్పటి వరకు కూడా సీఎం దృష్టికి తీసుకుపోతానంటూ కేటీఆర్​ చెప్పుతున్నారని, ఇంకా మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

కరోనాపై తండ్రీ, కొడుకులు డ్రామాలు ఆడుతున్నారని, ఎప్పుడు ఆరోగ్య శ్రీ లో చేర్చుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీలో చేర్చి వైద్యం అందించకుంటే తండ్రీ కొడుకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని, అధికారంలో ఉండి ఏం ఉద్ధరిస్తున్నారని, సీఎం పదవిలో ఉండే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో పాలన సాగించేది సీఎం కుటుంబం కోసమే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. కరోనాతో చనిపోయిన అందరి ఉసురు తగులుతుందని, టీఆర్​ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని, గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా అంటూ వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్​ భజన చేయడం ఆపాలని, ప్రజల గోసను పట్టించుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి హితవు పలికారు.

Next Story

Most Viewed