దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

by Disha Web Desk 15 |
దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
X

దిశ, జగదేవ్ పూర్ : ఆరుగ్యారంటీల ఆశ చూపించి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లో ప్రధాన రహదారిపై మెదక్ ఎంపీ అభ్యర్ధి పి. వెంకట్రామిరెడ్డి తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి తప్పుడు పనులని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలుకాకపోతే అవి గడ్డపారలవుతాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన కళ్యాణలక్ష్మీ రేవంత్ రెడ్డి మోసపూరిత వాగ్దానాల వల్ల అటకెక్కిందని, బంగారం ధర కొండెక్కిందని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు పట్టని బీజేపీ, కాంగ్రెస్ లకు ఓటెయ్యొద్దని కోరారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి, తన ఇంటిమీద వాలొద్దని ప్రగల్బాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి, సికింద్రాబాద్​లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరని ప్రశ్నించారు. కాకులను వాలనియ్యకుండా గద్దలను ఎత్తుకు పోయిన రేవంత్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదన్నారు.

అధికారంలోకి వచ్చి వందరోజులవుతున్నా ఇప్పటివరకు రైతు రుణమాఫీ చెయ్యలేదని, రాజీనామా చేస్తావా అంటే పారిపోయాడని విమర్శించారు. నాలుగు నెలలుగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలేదని, ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు బాకీ పడ్డారని అన్నారు. ఓటు అడగడానికి వస్తే మహిళలు చీపుర్లు పట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కిట్, పెంచిన పెన్షన్లు, రైతుబంధు ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేయలేదన్నారు. కాగా గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చిన 73 కోట్ల రూపాయలు గడా నిధులు, 45 కోట్ల ఎస్ డీఎఫ్ కింద నిధులు ఇస్తే వాపస్ తీసుకున్నారని ఆరోపించారు. వచ్చే జూన్ కు తెలంగాణ వచ్చి పదేళ్లని, ఇంకా విభజన సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, అవి సాధ్యం కావాలంటే బీఆర్ ఎస్ ఎంపీలను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో జిల్లాలు ఎక్కువైనాయని వాటిని తొలగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రజలకు చేసింది ఏమీలేదని, 300 ఉన్న సిలిండర్ వెయ్యి చేశారని, లీటరు రూ.60 ఉన్న పెట్రోల్ 110 చేశారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి సేవ చేస్తారని,

ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఎంపి అభ్యర్ధి పి. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ 11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా వివిధ హోదాల్లో సేవ చేసే భాగ్యం కల్పించారని, ప్రజల ఆదరణను, ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. ప్రజా సేవకుడిగా, మీలో ఒకడిగా ఉండాలని మీ ఆశీర్వాదం కోరుతూ మెదక్ ఎంపీగా మీ ముందుకు వస్తున్నందున ఆదరించాలని కోరారు. ఉమ్మడి మెదక్ ప్రజల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశంతో తన ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి రూ. 100 కోట్లతో వెంకట్రామిరెడ్డి ట్రస్టు ద్వారా సేవలందిస్తానని హామీ ఇచ్చారు. పేద పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. నిబద్ధత కలిగిన అధికారిగా, పేదలకు సేవ చేసిన వ్యక్తిగా ఉమ్మడి మెదక్ ప్రజలకు తన జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. మరోసారి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ వి.యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జగదేవ్ పూర్ జెడ్పీటీసీ వంటేరు సుధాకర్ రెడ్డి, నాయకులు గుండ రంగారెడ్డి, జంబుల శ్రీనివాస్, కేశిరెడ్డి నర్సింహారెడ్డి, అలేటి ఇంద్రసేనారెడ్డి, ఆర్.ఉపేందర్ రెడ్డి, జగదేవ్ పూర్, మర్కూక్ మండలాల కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Next Story