ఎంజీఎంలో అధ్వానంగా కొవిడ్ వార్డులు : బండి

by  |
ఎంజీఎంలో అధ్వానంగా కొవిడ్ వార్డులు : బండి
X

దిశ, పోచమ్మమైదాన్ : ఎంజీఎం, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రుల తీరు అధ్వాన్నంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఎంజీఎం దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంజీఎంలో పారిశుధ్యం పూర్తిగా లోపించిందన్నారు.కొవిడ్ వార్డులు సాధారణ వార్డుల కంటే దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా మరణాల సంఖ్య తక్కువ చూపిస్తున్నారని విమర్శించారు. పీఎం నిధుల నుంచి వంద వెంటిలేటర్లు పంపించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. పీపీఈ కిట్లు, సర్జికల్ మాస్కులు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ల కొరత వేధిస్తోందన్నారు. ఇప్పటికైనా రోగులను కాపాడే ప్రయత్నం చేయలని ప్రభుత్వాన్ని కోరారు.

అధికారుల పరివేక్షణ లేదనేది స్పష్టంగా కనిపిస్తోందని, సిబ్బంది కోరత తీవ్రంగా ఉన్నా ప్రస్తుత సిబ్బందితోనే పనులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో సిబ్బందిపై అధిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వార్డులో ఏడాది పైగా పని చేసిన డాక్టర్ శోభరాణీ మరో వైపు లాబ్ టెక్నీషియన్లు మృతి చెందారని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఫైర్ అయ్యారు. వైద్య సిబ్బంది, పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు, పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి ఆదనంగా పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయడం లేదని, మంచి వాటికి తమవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed