- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటినిండా ద్వేషాన్ని నింపుకున్న రాక్షసులకు ఇదేం అర్థమవుతుంది.. ప్రకాష్ రాజ్ ఫైర్
ఒంటినిండా ద్వేషాన్ని నింపుకున్న రాక్షసులకు ఈ మానవత్వం, గౌరవం అనేవి అర్థం కావు.

దిశ, సినిమా: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల తన తల్లిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయనకు, సోషల్ మీడియాలో కొందరు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవ్వడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రకాష్ రాజ్ తనకు దేవుడిపై నమ్మకం లేదని (నాస్తికుడినని) బహిరంగంగానే చెబుతుంటారు. అయితే, తన తల్లి అంత్యక్రియల సమయంలో ఆమె భౌతికకాయాన్ని చర్చిలో ఉంచి, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు, కీర్తనలు చేయించారు. ఈ విషయాన్ని పట్టుకుని, దేవుడిని నమ్మని వ్యక్తి ఇలా చర్చిలో ప్రార్థనలు చేయించడం ఏంటంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ప్రకాష్ రాజ్ తాజాగా తన స్టైల్‌లో ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. "అవును, నాకు దేవుడిపై నమ్మకం లేదు.. అది నా వ్యక్తిగతం.
కానీ మా అమ్మ తన దేవుడిని బలంగా నమ్మేది. ఆమె నమ్మకం ప్రకారం అంత్యక్రియలు జరిపించుకునే హక్కు ఆమెకు ఉంది. ఆ హక్కును నిరాకరించడానికి నేనెవరిని? ఒకరి నమ్మకాల పట్ల మనం చూపించుకునే కనీస గౌరవం ఇదే" అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, తనను విమర్శిస్తున్న వారిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "ఒంటినిండా ద్వేషాన్ని నింపుకున్న రాక్షసులకు ఈ మానవత్వం, గౌరవం అనేవి అర్థం కావు. సమాజంలో ద్వేషాన్ని రెచ్చగొట్టే ఆ రాక్షసులకు ఈ చిన్న విషయం ఎప్పటికైనా అర్థమవుతుందా?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు. తల్లి పట్ల తనకు ఉన్న ప్రేమను, ఆమె నమ్మకాల పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటిచెప్పిన ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లలో ఒక వర్గం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఇంకా భిన్నంగా స్పందిస్తున్నారు.






