నిజమైన ధైర్యం నిశ్శబ్దంగా ఉంటుంది.. కామా ఆసుపత్రి సిబ్బంది వీరగాథతో వస్తున్న కంగనా!

by Mallepaka Hamsa |

ఈ సినిమా 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో జరిగిన ఒక అద్భుతమైన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.

నిజమైన ధైర్యం నిశ్శబ్దంగా ఉంటుంది.. కామా ఆసుపత్రి సిబ్బంది వీరగాథతో వస్తున్న కంగనా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన తదుపరి భారీ ప్రాజెక్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'ఎమర్జెన్సీ' తర్వాత ఆమె నటిస్తున్న మరో శక్తివంతమైన రాజకీయ, సామాజిక డ్రామా ‘భారత్ భాగ్య విధాత’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, విడుదల తేదీని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో జరిగిన ఒక అద్భుతమైన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. బయట ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తుంటే, ముంబైలోని కామా ఆసుపత్రి లోపల 400 మంది ప్రాణాలను కాపాడిన సామాన్య ప్రజల వీరగాథ ఇది. ఆ రాత్రి భయంపై మానవత్వం ఎలా విజయం సాధించిందో, బాధ్యత త్యాగంగా ఎలా మారిందో ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు.

మనం సాధారణంగా యుద్ధ వీరుల గురించి వింటాం, కానీ ఈ సినిమాలో నర్సులు, వార్డ్ బాయ్స్, క్లీనర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, భద్రతా సిబ్బంది చూపిన అసాధారణ ధైర్యాన్ని వెలుగులోకి తెస్తున్నారు. "నిజమైన ధైర్యం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.. అది చేయాల్సిన పనిని చేసి వెనక్కి తగ్గుతుంది. భయం కంటే మానవత్వం ఎత్తుగా నిలిచిన ఆ రాత్రి కథ ఇది. బాధ్యతే త్యాగంగా మారినప్పుడు... ఐకమత్యమే కర్తవ్యంగా మారినప్పుడు... ధైర్యం ప్రాణాలను కాపాడినప్పుడు... భారతదేశపు నిజమైన వీరుల చెప్పని గాథ’’ అని కంగనా రాసుకొచ్చింది. మహిళలు అత్యంత క్లిష్ట సమయాల్లో తీసుకున్న ప్రాణాపాయ నిర్ణయాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. మనోజ్ తపాడియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మణికర్ణిక ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కంగనాతో పాటు గిరిజ ఓక్, స్మిత తాంబే వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలో నటించారు. ఈ ఉత్కంఠభరితమైన హ్యూమన్ థ్రిల్లర్ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Next Story