కావాలనే మా మధ్య చిచ్చు పెడుతున్నారు.. విమర్శకులకు సారా అలీఖాన్ స్ట్రాంగ్ కౌంటర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-09 10:33:23  IST  )

మీడియా కావాలనే ఇద్దరు మహిళల మధ్య గొడవలు ఉన్నట్లు సృష్టిస్తుంది. కానీ నిజానికి మేమంతా సెట్‌లో ఒకే కుటుంబంలా ఉంటాం.

కావాలనే మా మధ్య చిచ్చు పెడుతున్నారు.. విమర్శకులకు సారా అలీఖాన్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, సినిమా: ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, వామిఖా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన 'పతి పత్నీ ఔర్ వో 2' మే 15న థియేటర్లలోకి రాబోతోంది. సినిమా ప్రమోషన్లు ఫుల్ జోష్‌లో సాగుతుండగా, సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రకుల్, సారా కలిసి వామిఖాను పక్కన పెడుతున్నారంటూ కొన్ని పుకార్లు మొదలయ్యాయి. తాజాగా ఈ వార్తలపై రకుల్, సారా స్పందిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదని సారా అలీ ఖాన్ స్పష్టం చేశారు. "మీడియా కావాలనే ఇద్దరు మహిళల మధ్య గొడవలు ఉన్నట్లు సృష్టిస్తుంది. కానీ నిజానికి మేమంతా సెట్‌లో ఒకే కుటుంబంలా ఉంటాం. మా ముగ్గురి వ్యక్తిత్వాలు వేరైనా, మేమంతా మా పని పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఒకరి సీన్ బాగా వస్తే అది సినిమాకే మంచిదని మేము నమ్ముతాం. రకుల్, వామికా ఈ సినిమాలో ఎంత బాగా నటిస్తే, అది నాకు కూడా అంతగా ప్లస్ అవుతుంది" అని సారా చాలా హుందాగా సమాధానమిచ్చారు.

రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ క్యాట్ ఫైట్స్ వార్తలను కొట్టిపారేశారు. "ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే అది నిజం అనుకుంటారు, మీడియా చేసే పని కూడా అదే. షూటింగ్‌కు వచ్చే ఏ ప్రొఫెషనల్ నటుడైనా సినిమా విజయమే ముఖ్యం అని భావిస్తారు. ఎందుకంటే మూవీనే మాకు రోజీ రోటీ. అనవసరమైన గొడవలు పెట్టుకోవడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఒక సినిమా కోసం మేమంతా వంద శాతం కష్టపడి పని చేస్తాం తప్ప, ఇలాంటి చిన్నపిల్లల గొడవల గురించి ఆలోచించం" అని రకుల్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. సినిమాలో ప్రతి పాత్రకూ సమాన ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు ముదస్సర్ అజీజ్ స్క్రిప్ట్‌ను రూపొందించారని సారా తెలిపారు. ఎవరితోనూ ఎవరికీ పోలిక ఉండదని, చివరకు వారి ఆహార్యం, మేకప్ కూడా పాత్రల స్వభావానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. తమ మధ్య ఎలాంటి అసూయ లేదని, టీమ్ వర్క్ మాత్రమే సినిమాను నిలబెడుతుందని ఈ హీరోయిన్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది.

Next Story