నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. రైతు ఆరోపణలపై సోనాలి బింద్రే సంచలన కౌంటర్!

by Mallepaka Hamsa |

ఆ రైతు చేస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని, తాము చట్టప్రకారం కొనుగోలు చేసిన భూమిలోనే నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. రైతు ఆరోపణలపై సోనాలి బింద్రే సంచలన కౌంటర్!
X

దిశ, సినిమా: సీనియర్ నటి సోనాలి బింద్రే, ఆమె భర్త గోల్డీ బెహ్ల్‌లు మహారాష్ట్రలో ఒక భూ వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పుణే సమీపంలోని లోనావాలాలో వీరికి ఉన్న ఫామ్‌హౌస్‌కు ఆనుకుని ఉన్న భూమిని ఆక్రమించుకున్నారంటూ ఒక స్థానిక రైతు అధికారులను ఆశ్రయించారు. సోనాలి దంపతులు తమ ఆస్తి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించే క్రమంలో, తన పట్టా భూమిని కలిపేసుకోవడమే కాకుండా, తన పొలానికి వెళ్లే దారిని కూడా మూసేశారని ఆ రైతు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాను వ్యవసాయం చేసుకోలేక ఆర్థికంగా నష్టపోతున్నానని, తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ వివాదంపై సోనాలి బింద్రే ఘాటుగా స్పందించారు.

ఆ రైతు చేస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని, తాము చట్టప్రకారం కొనుగోలు చేసిన భూమిలోనే నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. "మా దగ్గర అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. నిజానికి ఆ రైతు మమ్మల్ని భయపెట్టి, మా నుండి భారీగా డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నాడు. అతనే మమ్మల్ని వేధిస్తున్నాడు" అని సోనాలి ఎదురుదాడికి దిగారు. ప్రస్తుతం ఈ వివాదం రెవెన్యూ శాఖ అధికారుల వద్దకు చేరింది. అధికారులు త్వరలోనే ఆ వివాదాస్పద భూమిని సర్వే చేసి, ప్రభుత్వ రికార్డుల ప్రకారం సరిహద్దులను నిర్ణయించాలని నిర్ణయించారు. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆ భూమి అసలు ఎవరికి చెందుతుంది? రైతు ఆరోపణల్లో నిజమెంత? లేదా సోనాలి చెబుతున్నట్లు అది బ్లాక్ మెయిల్ ప్రయత్నమా? అనేది తేలనుంది.

Next Story