హృదయం ఎప్పటికీ మర్చిపోదు.. అతడిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ అనీత్ పడ్డా ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

మనసు మర్చిపోవచ్చు కానీ హృదయం మర్చిపోదు అనే మాట తన తాతయ్య విషయంలో అక్షర సత్యమని, ఆయన తన పేరు మర్చిపోయినా ప్రేమగా హీరాపుత్ లేదా మఖన్ అని పిలిచేవారని ఆమె గుర్తుచేసుకున్నారు.

హృదయం ఎప్పటికీ మర్చిపోదు.. అతడిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ అనీత్ పడ్డా ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: 'సయ్యారా' చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ అందుకున్న యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమెకు ఎంతో ఇష్టమైన తన తాతయ్య కన్నుమూశారు. ఈ విషయాన్ని అనీత్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. తన జీవితంలో ఒకే ఒక్క ప్రేమ ఆయనేనని పేర్కొంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాతయ్య చేతిని పట్టుకుని ఉన్న ఒక ఫోటోను అనీత్ షేర్ చేస్తూ.. "మీరు జ్ఞాపకాలను కోల్పోతున్నప్పటికీ, మీ 'మఖన్' (అనీత్ ముద్దుపేరు)ను మాత్రం మర్చిపోలేదు. మీ జ్ఞాపకశక్తి మిమ్మల్ని వదిలేస్తున్నా, మీ గుండెల్లో నాపై ఉన్న ప్రేమను మాత్రం గట్టిగా పట్టుకున్నారు" అని ఆమె రాసుకొచ్చారు. తన తాతయ్య మంచితనాన్ని, ఆయన చెప్పిన జోకులను, కథలను ఎప్పటికీ తనతోనే మోస్తానని, ఆయన నేర్పిన నిస్వార్థమైన ప్రేమను ప్రపంచానికి చాటుతానని అనీత్ పేర్కొన్నారు. ఆకాశంలో మెరుస్తున్న ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూశానని, అది తన తాతయ్యే అని తనకు తెలుసంటూ ఆమె రాసిన మాటలు నెటిజన్లను కలచివేస్తున్నాయి. గతేడాది ఒక ఇంటర్వ్యూలో అనీత్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.

ఆమె నటించిన 'సయ్యారా' సినిమాలో అల్జీమర్స్ (జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యాధి) బాధితురాలిగా నటించారు. అయితే నిజ జీవితంలో తన తాతయ్య కూడా అదే వ్యాధితో బాధపడుతున్నారని ఆమె అప్పట్లో తెలిపారు. "మనసు మర్చిపోవచ్చు కానీ హృదయం మర్చిపోదు" అనే మాట తన తాతయ్య విషయంలో అక్షర సత్యమని, ఆయన తన పేరు మర్చిపోయినా ప్రేమగా హీరాపుత్ లేదా మఖన్ అని పిలిచేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. కాగా.. అనీత్ పడ్డా సినీ కెరిర్ విషయానికొస్తే.. మోడలింగ్‌తో మొదలైంది. 2022లో కాజల్ నటించిన ‘సలామ్ వెంకీ’తో వెండితెరపై అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌లలో నటించారు. అయితే 2025లో మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన 'సయ్యారా' సినిమా ఆమె దశను మార్చేసింది. దాదాపు రూ. 580 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ రొమాంటిక్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అనీత్ చేతిలో 'శక్తి శాలిని' వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తాతయ్య మరణం ఆమెను తీరని వేదనకు గురిచేసినప్పటికీ, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Next Story