భయంతో వణికిపోతున్న హీరో.. ఒత్తిడి కారణంగా నా షెడ్యూల్స్ దెబ్బతింటున్నాయంటూ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

రెండు రోజుల ముందు నుండే నాకు తెలియని భయం, ఆందోళన మొదలైపోతున్నాయి. ఇప్పటికీ ఆ భయం నుండి నేను బయటపడలేకపోతున్నాను.

భయంతో వణికిపోతున్న హీరో.. ఒత్తిడి కారణంగా నా షెడ్యూల్స్ దెబ్బతింటున్నాయంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ అంటే మనకు గుర్తొచ్చేది గాల్లో పల్టీలు కొట్టడం, భారీ స్టంట్స్ చేయడం. వెండితెరపై అంత ధైర్యంగా కనిపించే టైగర్‌కు నిజ జీవితంలో ఒక వింత భయం ఉందట. అదే ‘ఏరోఫోబియా’. అంటే విమానం ఎక్కాలన్నా, విమాన ప్రయాణం అన్నా ఆయనకు విపరీతమైన భయం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న ఈ భయాన్ని ఆయన బయటపెట్టారు. ‘‘నాకు విమానాలంటే చాలా భయం.. అవును, నాకు 'ఏరోఫోబియా' ఉంది. దీని గురించి ఇప్పుడు నేను ఒక థెరపిస్ట్‌ను కూడా కలవాలని అనుకుంటున్నాను. అసలు ఈ భయం ఎందుకు మొదలైందంటే.. కొన్నేళ్ల క్రితం ఒకసారి నేను విమానంలో వెళ్తున్నప్పుడు విపరీతమైన టర్బులెన్స్ (విమానం గాల్లో ఊగిపోవడం) ఎదురైంది. ఆ సమయంలో విమానం నా కంట్రోల్‌లో లేదు కదా.. నేను ఏం చేయగలను? ఆ ఆలోచనే నన్ను వణికించింది. అప్పటి నుండి ఇప్పటికీ, నేను విమానం ఎక్కాల్సి వస్తే రెండు రోజుల ముందు నుండే నాకు తెలియని భయం, ఆందోళన మొదలైపోతున్నాయి. ఇప్పటికీ ఆ భయం నుండి నేను బయటపడలేకపోతున్నాను. గణాంకాల ప్రకారం విమాన ప్రయాణం చాలా సురక్షితమని అందరూ చెబుతుంటారు.

నేను చాలా మంది పైలట్లతో కూడా మాట్లాడాను. రోడ్డు మీద గుంతలు ఉంటే కారు ఎలా ఊగుతుందో, గాల్లో విమానం ఊగడం కూడా అంతే సాధారణం అని వాళ్లు నాకు నచ్చజెప్పారు. కానీ, ఆ సమయంలో నా మనసుకి అది అర్థం కాదు. నాకు నా శరీరం మీద, నా కదలికల మీద పూర్తి నియంత్రణ ఉండటం ఇష్టం. కానీ విమానంలో నా ప్రమేయం లేకుండా ఏం జరుగుతుందో తెలియని ఆ పరిస్థితి నన్ను బాగా భయపెడుతుంది. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు ఇది నాకు చాలా చిరాకు కలిగిస్తుంది. నా రోజువారీ పనుల్లో కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతుంటాను. నా శక్తిని పూర్తిగా ఎలా ఉపయోగించుకోవాలో కూడా అర్థం కానంతగా కొన్నిసార్లు అయోమయంలో పడిపోతుంటాను. వెండితెరపై నేను ఎంత ధైర్యంగా కనిపించినా, లోపల మాత్రం ఈ భయం నన్ను వెంటాడుతూనే ఉంది. ఒత్తిడి కారణంగా నా షెడ్యూల్స్ దెబ్బతింటున్నాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. యాక్షన్ స్టంట్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే టైగర్ ష్రాఫ్‌కు ఈ వింత భయం ఏంటని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story