సెట్స్‌పైకి వెళ్తున్న క్రేజీ కాంబో.. విజయ్ సేతుపతి-సాయి పల్లవిలపై మణిరత్నం సరికొత్త ప్రయోగం!

by Mallepaka Hamsa |

‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ చిత్రాల తర్వాత, మణిరత్నం ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.

సెట్స్‌పైకి వెళ్తున్న క్రేజీ కాంబో.. విజయ్ సేతుపతి-సాయి పల్లవిలపై మణిరత్నం సరికొత్త ప్రయోగం!
X

దిశ, సినిమా: దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన సినిమాలతో వెండితెరపై ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంటారు. ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ చిత్రాల తర్వాత, ఆయన ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈసారి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవిలను ప్రధాన పాత్రల్లో ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఇద్దరు నటులు తమ సహజ సిద్ధమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నవారే, ఇప్పుడు మణిరత్నం మేకింగ్‌లో వీరు కలిసి కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 మే 14 నుంచి ప్రారంభం కానుంది. అయితే, అంతకంటే ముందే అంటే ఈ ఏప్రిల్ నెలాఖరులోనే ఒక పవర్‌ఫుల్ ప్రోమో షూట్‌ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ ప్రోమో ద్వారా సినిమా థీమ్ లేదా టైటిల్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్. మణిరత్నం ఈ చిత్రాన్ని కేవలం 40 నుండి 45 రోజుల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

విజయ్ సేతుపతి, సాయి పల్లవి మధ్య సాగే ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై కొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత, రాక్‌స్టార్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్ అంటేనే అదొక మ్యూజికల్ ట్రీట్. ఇప్పటికే రెహమాన్ ఈ సినిమా కోసం రెండు అద్భుతమైన పాటల కంపోజిషన్ పూర్తి చేశారని సమాచారం. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. బలమైన కథకు తోడు, అద్భుతమైన నటీనటులు, మ్యూజికల్ వండర్ తోడవ్వడంతో ఇది ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story