ఫైనల్లీ డాక్టరమ్మ అయిపోయిన శ్రీలీల.. వీడియో వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-11 09:47:45  IST  )

టాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల(Sree Leela) డాక్టర్ పట్టా పొందింది.

ఫైనల్లీ డాక్టరమ్మ అయిపోయిన శ్రీలీల.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sree Leela) తన జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. వెండితెరపై తన నటనతో, అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు నిజ జీవితంలో ‘డాక్టర్ శ్రీలీల’గా మారిపోయింది. గత కొంతకాలంగా ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు వైద్య విద్యను కొనసాగించిన శ్రీలీల, ఎట్టకేలకు తన ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకుంది. సాధారణంగా చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్న హీరోయిన్లు చదువును మధ్యలోనే వదిలేయడం లేదా గ్యాప్ తీసుకోవడం చూస్తుంటాం. కానీ శ్రీలీల మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. వరుస షూటింగ్‌లతో క్షణం తీరిక లేకపోయినా, సెట్స్‌లోనే పుస్తకాలు పట్టుకుని చదువుకుంటూ తన పట్టుదలతో పట్టా సాధించింది.

‘‘నేను నటిని కావాలని కోరుకున్నాను, కానీ డాక్టర్ అవ్వాలనేది నా కల’’ అని ఆమె గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే, కష్టపడి చదివి నేడు డాక్టర్ పట్టా పొంది తన కలను నెరవేర్చుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు శ్రీలీల గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. డాక్టర్ కోటు ధరించి, ఎంతో గర్వంగా పట్టా అందుకుంటున్న శ్రీలీలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ నువ్వు గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సాయి పల్లవి వంటి ఇతర హీరోయిన్లు కూడా డాక్టర్లు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో శ్రీలీల కూడా చేరడం విశేషం. ఈ డాక్టరమ్మ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

Next Story