94 ఏళ్ల వయసులో సింగీతం మ్యాజిక్..‘SSR-61’టైటిల్ కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-29 14:20:50  IST  )

40 ఏళ్లుగా వేచి ఉన్న ఒక కథ.. ఇంతకు ముందెన్నడూ మీరు చూడనిది అని క్యాప్షన్ ఇచ్చారు.

94 ఏళ్ల వయసులో సింగీతం మ్యాజిక్..‘SSR-61’టైటిల్ కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్!
X

దిశ,సినిమా: భారతీయ చలనచిత్ర రంగానికి ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు, 94 ఏళ్ల వయసులో కూడా తనలోని ప్రేక్షకులను అలరించేందుకు తాపత్రయపడుతున్నారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘SSR-61’. ఒక మేధావి దర్శకుడు, మరో అద్భుతమైన సృజనాత్మక దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుండటం సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకులోనూ భారీ అంచనాలను పెంచింది. వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను చిత్రబృందం ఇచ్చింది. ఒక చెట్టు కొత్తగా ఆకులు చిగురిస్తున్న అందమైన పోస్టర్‌ను షేర్ చేస్తూ, "40 ఏళ్లుగా వేచి ఉన్న ఒక కథ... ఇంతకు ముందెన్నడూ మీరు చూడనిది" అని క్యాప్షన్ ఇచ్చారు. దీనితో ఈ సినిమా నేపథ్యం ఏదై ఉంటుందా? అసలు ఆ 40 ఏళ్ల కథేంటి? అని నెటిజన్లు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. దీనికి తోడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, విజువల్స్‌తో పాటు మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమనిపిస్తోంది.

సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతూ, మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గతంలోనే ‘తమ గౌరి తనే’ అంటూ ఒక అమ్మాయి లంగా ఓణీలో ఉన్న పోస్టర్‌తో ప్రేక్షకులకు ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చిన టీమ్, ఇప్పుడు టైటిల్ రివీల్ కోసం రంగం సిద్ధం చేసింది. సింగీతం శ్రీనివాసరావు గారి మార్కు వినూత్న కథాంశం, నాగ్ అశ్విన్ నిర్మాణ విలువలు తోడైతే ఈ సినిమా మరో కళాఖండంగా మారుతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. "వావ్.. సూపర్ ఎగ్జైటెడ్!", "లెజెండరీ కాంబినేషన్ కోసం వేచి చూస్తున్నాం" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 94 ఏళ్ల వయసులో కూడా ఇంత ఉత్సాహంతో సింగీతం శ్రీనివాసరావు గారు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం నిజంగా గొప్ప విషయమని అందరూ కొనియాడుతున్నారు.

Read More... గతం నేర్పిన పాఠం.. భయంకరమైన భవిష్యత్తు.. ‘తుంబాడ్-2’ విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్

Next Story