చివరి నిమిషంలో బిగ్ షాకిచ్చిన ‘సతీ లీలావతి’ మూవీ మేకర్స్.. కీలక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

అంచనాలకు తగ్గట్టుగా, ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాం.

చివరి నిమిషంలో బిగ్ షాకిచ్చిన ‘సతీ లీలావతి’ మూవీ మేకర్స్.. కీలక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సతీ లీలావతి’(Sathi Leelavathi). మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘శివ మనసులో శృతి’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. చిత్ర బృందం మొదట ఈ సినిమాను మార్చి 6న వేసవి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేసింది. అయితే, విడుదలకి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉన్న సమయంలో మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లు ప్రకటించారు. ఈ వాయిదాపై క్లారిటీ ఇస్తూ మేకర్స్ ఒక కీలక నోట్‌ను విడుదల చేశారు.

‘‘లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ నటించిన 'సతీ లీలావతి'ని మార్చి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాం. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల తేదీని మార్చాల్సి వచ్చింది. మీ అంచనాలకు తగ్గట్టుగా, ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అందుకే ఈ చిన్న జాప్యం జరుగుతోంది. మంచి విషయాలు ఎప్పుడూ సరైన సమయంలోనే జరుగుతాయి’’ అని రాసుకొచ్చారు. సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై మెగా అభిమానుల్లోనూ, సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Next Story